పుట:Bobbili yuddam natakam.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాంకము.

స్థలకము. - బుస్సీ డేరా.

(హైదరు, విజయరామరాజు, బుస్సీయు యథోచితము ప్రవేశింతురు.)

బుస్సీ. - ఏమి మహారాజా ? ఈరాత్రివేళ కట్టు పంచెతోను కాలినడకతోను వచ్చినారు ? హైదరుం గూడ తెచ్చినారు ?

హైదరు. - ఈఛనము బొబ్బిలికోటమీదికి నడిస్తిమా, కోట పడతా మంట ; ఈ రాత్రి తప్పితే బొబ్బిలి మనవల్ల గా దంట.

బుస్సీ. - అది యెట్లు మహారాజా ?

రాజు. - డొంకలోనిపులి పొదలో చేరినది; తాండ్రపాపయ్య కోటలో లేఁడు, రాజాములో నున్నాఁడు. హర్కారాలచే రంగారాయఁడు అతనికి బంపిన జాబు ఇదిగో. ఎ టయినను మనరాక ఈగడియకో పైగడియకో అతనికి తెలియక మానదు; తెలిసినంతనే అతఁడు రాక మానఁడు. వచ్చినంతనే మనల నందఱను రూపుమాపక మానఁడు.

బుస్సీ. - [అప్రియముగాఁ జూచుచు] ఇసీ ! ఆహర్కారా లిట నున్నారా ? వారివలన నింక నే మయినం దెలిసికొందము.

రాజు. - ఆహర్కారాలు ఇరువురు బికారివేసముల బిచ్చమెత్తుకొనుచు 11 పహరాలు దాఁటినారు. 12 డవ పహరాలో మీరాసాహెబు వారిని అడ్డగించి, సోదా చూచి, వారి గోధుమరొట్టెలను విఱువ నుండఁగా, వారు ఆరొట్టెలను పెఱుకుకొన యత్నించి, వానిచేతినుండితీసికోలేక, ఆజులుముచేత లేచిన మన సిపాయీలమీద, తమ కాసెకోకలలో దాఁచుకొనియున్న బాకుమాత్రముతో కలియఁబడి, సాయుధులను నూర్గరను పొడిచి, తాము పొడుచుకొని చచ్చినారు. మీరాసాహేబు నాకు ఆ రొట్టెలలోని యీజాబులను తెచ్చి యిచ్చినాడు.

బుస్సీ. - [ముక్కుపై వ్రే లిడుకొని] ఆహా ! ఈబొబ్బిలిలో హర్కారాలే ఇంత పని చేసినారు ! బంట్లు దొరలు ఏమి చేయుదురో! అయ్యా, ఇపుడు అంధకారము ; తెల్లవాఱ నిండు. హర్కారాలు దొరకిరిగదా ? ఇంక తాండ్ర పాపయ్యకు కబురు అందు ననుభయము లేదు గదా ?