పుట:Bobbili yuddam natakam.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇందలి కథాసందర్భము.

గోలకొండ నైజాముగారు ఉత్తరసర్కారులలో జమీన్దారులవలన కప్పము తండు మని ఫ్రెంచివారి సేనాపతిని బుస్సీదొరను నియమించి, ఆతనికి అతని ఫ్రెంచి దండునకు దోడుగా గొప్ప గోలకొండ సైన్యము నిచ్చి, హైదర్జంగు అనువానిని దివానుగా నేర్పరించినారు. వారు వచ్చి రాజమహేంద్రవరముకడ విడిసి ఉత్తరమందలి జమీన్దారులకు తెలిపినారు. వెంటనే విజయనగరము నేలు విజయరామరాజు బూసీ దర్శనమునకు వచ్చెను. బొబ్బిలి జమీనును హరింపవలయు నని ఎప్పుడును కోరుచుండువాఁడు విజయరామరాజు గోలకొండవారి హర్కారాలకు లంచమిచ్చి వారు బొబ్బిలి రంగారాయనికై తెచ్చిన జాబును ఆయనకు చేరనీక ఆపివైచెను. అందువలన మొగలాయీల రాక తెలియక బొబ్బిలిదొర రాజమహేంద్రవరమునకు బూసీబేటికి రా లేదు. రాజు మొగలాయీల బేటికి రమ్మని రంగారాయనికి తాను జాబు పంపినట్లును, గర్వాంధుఁ డై యాతఁడు రానియట్లును బుస్సీని నమ్మించి, ఆయహంకారము నడంచుటకై వారు బొబ్బిలిని కొట్టవలసినట్లును, రంగారాయఁడు నిరంతరము తనకు ఉపద్రవములు చేయుచుండుటవలన తాను తన పేష్కస్సును ఇయ్యలేక పోయి నట్లును ఇప్పుడు వారు ఆతనిం గొట్టి యాతని జమీనును తన కిత్తురేని రెండు జమీనుల పైకమును నిలువలతో గూడ సమస్తమును తానేకట్టునట్లును, వారి నొడంబఱిచెను. ఆ ప్రకారము నెఱవేర్చునందులకై బుస్సీకి తెలియనీయక లక్షవరహాలు హైదరుజంగునకు లంచము ఇయ్యనొప్పుకొనెను.

బొబ్బిలివారు ఈవృత్తాంతము నేమియు నెఱుంగక 50 పెండ్లిండ్ల మహోత్సవములో మునింగి యుండిరి. రాత్రి కోటలో ఊరేగింపు ముగియుచుండగా, తెల్లవాఱఁ బోవుచుండగా, ఊరి బయట రాజును మొగలాయీలును ముట్టడి ముగించిరి. పగలు రాయబారములు. బూసీదూత వచ్చి రంగరాయని దర్శించి హైదర్జంగుమాటగా, తత్క్షణమే వీరు నౌబత్తును మాన్పవలసినట్లును, జాముసేపులో, కోట వెడలి పాలకొండకు పోవలసినట్లను తెలిపెను. వీరు అందులకు అంగీకరింపక బదులు రాయబారము పంపిరి, వీరి రాయబారిని హైదరు లోనగువారు తిరస్కరింపఁగా నాతడు అడ్డ మయినవారి నెల్ల తెగనఱకుకొని కోటకు వచ్చి తన పోక ఫలింప దాయెనని రాయనికిం జెప్పెను. అది మొదలు యుద్ధ నిశ్చయము, బొబ్బిలివారి సన్నాహము. ఆరాత్రి 12 గంటలప్పుడు