పుట:Bobbili yuddam natakam.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాంకము. 17

[ప్రకాశము] ఇంతకు పూర్వ మెప్పుడును మాకు జోస్యులు జయము చెప్పలేదు. ఈమాఱు అటావలి యెల్లుండి సూర్యోదయమునకు పూర్వమే బొబ్బిలివారి కెవ్వరికిం దెలియనీయక బొబ్బిలికి ముట్టడి వేయుదు మేని జయ మని మాజోస్యులు చెప్పినారు. అట్లు అతర్కితోపపతితముగా వారిమీఁద బడుటకు, మీరు వలంతులేని నేను సాయము రాఁగలను. మనకు జయమని నిశ్చయము. విలంబము చేయుదు రేని, మనకు జయము కలుగదు.

హైదరు. - ఆలాగే వెల్దాం, ఇందుకీ వోచన యెందుకి?

రాజు. - మఱి మేము విజయనగరమునకు పోము. అందఱు నొక్క మొగిని రేయుం బవలు నడువవలయును; మాతురుపులు దారి నడుపుదురు. మీరు త్వరగా ప్రయాణభేరులు కొట్టింపుఁడు. మఱి మాకు సెల వొసంగుఁడు.

బుస్సీ. - హైదరుసాహెబు, మహారాజుగారిని సాగ నంపి రమ్ము. సలాము మహారాజా. [అందఱును లేతురు. సలాములు మార్చుకొందురు. రాజు, రాజపరివారము, హైదరును, పరిక్రమింతురు.

బుస్సీ. - మనముపోయి మన పనులు చూచుకొనవచ్చును. [బుస్సీ ప్రభృతులు నిష్క్రమింతురు]

రాజు. - మీరు చాల వ్యవహారసమర్థులు. పరంగివానిని క్షణములో ఒప్పించినారు. ఈస్నేహమునకు బదులుగా, మాతాతగారికి ఢిల్లీసుల్తానుగా రిచ్చినది, రత్నాలు తాపిన యీ కైజారును, కమర్బందును, మీయొద్ద ఉండవలయును. మా ప్రక్కలోని బల్లెమును, కంటిలోని నలుసును, మీరు ఊడఁబెఱికిన వెంటనే, మేము ఒప్పుకొన్న పైకమును, పైగా మాకృతజ్ఞతను మీరే కందురు. [నేపథ్యములో 'ఓంభాయి, ఓంభాయి.' అప్పన్న లోనుగా పరివారము, రాజును కలసికొనును.

రాజు. - [వినుట నభినయించి] అప్పన్నా, ఎవరది ఆసవారి?

అప్పన్న. - సామర్లకోట నీలాద్రిరాయనింగారిది.

రాజు. - పోయి, మేమిక్కడ నున్నా మని, వారు దర్శన మిప్పించిన సంతోషించెద మని, మర్యాదగా పలికి తోడ్కొనిరా. [అప్పన్న అట్లేచేయును.

రాజు. - ఓహో; సంవత్సరకాలమునకు దర్శనము!

నీలాద్రి. - ఈదినము మాకు మహాపుణ్యదినము.

రాజు. - ఈరాక హైదరుజంగుగారి జమాబందికా ?

నీలాద్రి. - అవును.