పుట:Bibllo Streelu new cropped.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముసలి తనాన 127వ యేట మరణించింది. బైబులు స్త్రీలందరిలోను సారా వయసు మాత్రమే పేర్కొంటుంది. ప్రాచీన హీబ్రూ ప్రజలకు ఆమె పట్లగల గౌరవం ఆలాంటిది. అబ్రాహాము మ మండలంలోని మక్ఫేలా వద్ద ఒక గుహనుకొని సారాను దానిలో పాతిపెట్టాడు. తర్వాత అబ్రాహాముని గూడ తనయులు ఆ గుహలోనే ఖననం జేశారు.

   నూత్న వేదం సారాను గౌరవంతో ప్రస్తావిస్తుంది. ఆమె స్వతంత్రురాలు, మనందరికి తల్లి-గల 4,24.27. ఆమె భర్తకు విధేయురాలు -1పేతు 3,5-7. సారా అనగానే మనకు స్పురించే భావాలు ఆదర్శ గృహిణి, విశ్వమాత. ఆమె పూర్ణహృదయంతో దేవుని మార్గాల్లో నడచిన భక్తురాలు.

3. కష్టాలకు గురైన హాగరు

హాగరు ఈజిప్టు స్త్రీ. సారాకు బానిస. ఆమె పేరుకి పారిపోయినది అని అర్థం. హీబ్రూ ప్రజలు ఆమె ఈజిప్టురాజు కొమార్తె అనీ, సారా పట్ల మోజుపుట్టి ఆమెను అనుసరించి వచ్చిందనీ కట్టుకథలు అల్లారు. బహుశ ఆమె బానిసపిల్ల. అబ్రాహాము దంపతులు ఈజిప్టులో వున్నపుడు ఆమెను కొనితెచ్చుకొని వుంటారు. ఏమైతేనేమి, హాగరు తన సొంత దేశాన్నిదేవుళ్లనీ విడనాడి సారావెంట కనాను దేశానికి వచ్చింది. యావే ప్రభువుని కొల్చింది.

             సారా తొందరపాటు

దేవుడు అబ్రాహాముకి అసంఖ్యాకమైన సంతానాన్ని దయచేస్తానని మాట యిచ్చాడు - 12,3. ఐనా గొడ్రాలైన సారా ఆ వాగ్దానం నెరవేరిందాక ఓపిక పట్టలేక పోయింది. కనుక హాగరును అబ్రాహాముకు భార్యగా సమర్పించి వారి నుండి పుట్టిన బిడ్డణ్ణి తన బిడ్డణ్ణి చేసికోగోరింది. ఆనాటి మొసపోటామియా చట్టం ఈ సంప్రదాయాన్నిఅంగీకరించింది. అబ్రాహాము హాగరును కూడగా ఆమె గర్భవతి ఐంది.