పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. శిష్యులది సేవాజీవితం

పిలుపు సేవ కొరకు, ప్రభువు శిష్యులతో "మీరు నన్ను వెంబడించండి. నేను మిమ్మ మనుష్యులను పట్టేవాళ్ళనుగా చేస్తాను" అన్నాడు- మార్కు 1,17. అనగా వాళ్లు ఇంతకుముందు చేపలను పట్టినట్లే ఇకమీదట మనుష్యులను పట్టాలి. ఈలా మనుష్యులను పట్టడమే వాళ్ళ సేవ. కాని యిక్కడ మనుష్యులను పట్టడమంటే యేమిటి? క్రీస్తు దైవ రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. శిష్యులువెళ్ళి ఆ రాజ్యంలో చేరడానికి నరులను ప్రోగుజేసికొనిరావాలి. ఏలా? అతని సువార్తను విన్పించడం ద్వారా, అతడు ఆదేశించిన పరిచర్యలను చేయడంద్వారా. ఇదంతా ఓ పెద్ద సేవా కార్యక్రమం. సువిశేషంలోని ముగ్గురు సేవకుల సామెత ఈ సేవాభావాన్నే సూచిస్తుంది - మత్త 25, 14-80. సేవాభావం శిష్యుల ప్రధానలక్షణాల్లో ఒకటి.

9. శిష్యులు క్రీస్తుకి సాక్షులు

రబ్బయిల శిష్యులూ గ్రీకు తాత్వికుల శిష్యులూ తమ గురువుల బోధలను జాగ్రత్తగా ప్రచారం చేసారు. వాటిని తమ శిష్యులకు అందించి పోయారు. పౌలు గమలియేలు అనే రబ్బయి శిష్యుడు. క్రైస్తవుడు కాకమునుపు అతడు ఆ గురువు బోధలను జాగ్రత్తగా ప్రచారం చేస్తూండేవాడు - అచ 22,3, ఈలాగే పూర్వం మనదేశంలోగూడ శిష్యులు తమ గురువుల బోధలను కంఠస్థంచేసి ఒక్కమాటగూడ తప్పిపోనీకుండా పునశ్చరణం చేసేవాళ్ళు ఈవిధంగా ఒక్కోగురువు బోధలు చాలకాలం వరకు ప్రచారమయ్యేవి. అతనికి శిష్యులూ ప్రశిష్యులూ తయారయ్యేవాళ్లు. ఈ శిష్యపరంపరకు ఆ గురువు కులపతి. వాళ్ళ బోధలు అతనివి. వాళ్ళు అతని సంప్రదాయాన్ని అనుసరించేవాళ్ళు. కాని క్రీస్తు శిష్యులు ఈలా చేయలేదు. వాళ్లు ప్రభువు జీవితగాథనీ అతనివ్యక్తిత్వాన్నీ ప్రచారంజేసారుగాని కేవలం అతని బోధలనుగాదు. శిష్యులు క్రీస్తు సంప్రదాయాన్ని మాత్రమే గౌరవించలేదు. అతన్ని దేవునిగా భావించి పూజించారు.

క్రీస్తు గొప్ప బోధకుడు. అతడు పరలోక రాజ్యాన్ని గూర్చీ తండ్రినిగూర్చీ చెప్పాడు, శిష్యులు తమతరపున తాము బోధకు పూనుకొన్నపుడు ఆ బోధకుని బోధలను బోధింపలేదు. మరి ఆ బోధకుట్టే బోధించారు. బోధచేసిపోయిన క్రీస్తే శిష్యుల బోధల్లో బోధనాంశం అయ్యాడు.

వాళ్ళ ప్రభువు ఉపదేశాలను చెప్పడంగాదు, ఆ ప్రభువు మరణోత్తానాలకు సాక్ష్యంగా ఉండడం ముఖ్యం అనుకొన్నారు. యూదా స్థానాన్ని పూరించే పండ్రెండవ శిష్యుడు మతీయ క్రీస్తు పునరుత్తానానికి సాక్ష్యంగా వుండాలి - అకా 1, 21-22. ఇతర శిష్యులుకూడ భూదిగంతాలవరకూ ఉత్తాన క్రీస్తుకి సాక్షులై వుండాలి- అకా 1,8.