పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ నాల్గవ సువిశేషం వ్రాసిన రచయిత ఈ గ్రంథంలోని అంశాలకు నేనే సాక్షిని అని చెప్తున్నాడు -24 క్రీస్తు ప్రేమించిన శిష్యునికి అనుచరులు వున్నారు. వాళ్ళంతా ఆ శిష్యుని నాయకత్వాన ఓ భక్త సమాజంగా ఏర్పడ్డారు. ఈ సమాజంలోనే ఈ నాల్గవ సువిశేషం పుట్టింది. దీన్ని నేరుగా ఈ శిష్యుడు వ్రాసివుండకపోవచ్చు. అతని పేరు మీదిగా, అతని భావాలతోనే ఈ భక్త సమాజంలోని రచయిత ఎవడో వ్రాసి వుంటాడు. ఐనా ఈ గ్రంథం ఈ గొప్ప శిష్యుని పేరుతోనే ప్రచారంలోకి వచ్చింది. ఈ గ్రంథంలో చెప్పిన అంశాలన్నీ నిజమేనని ఈ శిష్యుడు హామీ యిస్తున్నాడు. అతడు స్వయంగా క్రీస్తుతో కలసి జీవించినవాడు. కనుక అతని హామీని మనం నమ్మవచ్చు. ఆ శిష్యుడు లోకాంతం వరకు బ్రతికి వుండడంకంటె అతని హామీ ముఖ్యమైంది. ఈ సువిశేషం ద్వారా అతడు మనమధ్యలో ఇంకా జీవిస్తూనే వున్నాడు అనుకోవాలి. దానిలోని వాక్యాలు నేటికీ మనకు జీవమిస్తున్నాయి కదా! అతడు శారీరకంగా మన మధ్యలో జీవించివుండడం కంటె ఈ పుస్తకంలోని వాక్యాలు ఎక్కువ విలువైనవి. పేత్రు నాయకత్వాన్నీ యోహాను ప్రాముఖ్యాన్నీ వెల్లడిచేయడానికే చివరి సంపాదకుడు ఈ 21వ అధ్యాయాన్ని చేర్చాడు.

యోహాను ఈ సువిశేషంలోని అంశాలకు సాక్షి కాని ప్రధాన సాక్షి పవిత్రాత్మ ఆ యాత్మ క్రీస్తు జీవితానికి సాక్షి యోహాను శిష్యులు వ్రాసిన ఈ సువిశేషానికి సాక్షి ఈనాడు మనం ఈ గ్రంథాన్ని చదివి క్రీస్తుపట్ల విశ్వాసాన్ని పెంచుకోవడానికి సాక్షి కనుక మనకు జ్ఞానోదయం కలిగించి క్రీస్తుని విశ్వసించే భాగ్యాన్ని దయచేచమని యాత్మనే అడుగుకొందాం.

మనం ఏదైనా ఓ భక్తసమాజానికి చెందివుండాలి. మనకు విశ్వాసం చాలనపుడు ఈ భక్తబృందం దాన్ని పెంచుతుంది. మన ఆదర్శ జీవితం ద్వారానైతేనేమి, బోధద్వారా నైతేనేమి, రచనల ద్వారానైతేనేమి మనం ఈ భక్తబృందం స్థాయిని పెంచగలిగితే ఇంకా మంచిది.