21. ఆత్మ విజ్ఞాపనం - రోమీ 8, 26-27.
క్రీస్తు మోక్షంలో మనకోసం ప్రార్థన చేస్తూవుంటే ఆత్మ మన హృదయంలోనే మనకోసం ప్రార్థన చేస్తూవుంటుంది. మనకోసం మాత్రం గాదు, మనతోనూ ప్రార్ధన చేస్తుంది. అనగా ఆత్మతో కలసి మనమూ ప్రార్థన చేస్తుంటాం. మనతోకలసి, ఆత్మ ప్రార్ధన చేస్తుంటుంది. ఈ యాత్మ సహాయంలేందే మనం ఏలా ప్రార్ధించాలో,దేని కోసం ప్రార్థించాలో తెలిసికోలేం. పరిశుద్ధాత్మ మన హృదయంలో నెలకొని వుండి మనచేత ప్రార్ధనం చేయిస్తుంది గనుకనే, మనం ప్రార్ధింప గలుగుతూన్నాం. మనంచేసే విజ్ఞాపన ప్రార్ధన లన్నిటినీ ఈ పరిశుద్ధాత్మ ప్రార్థనలతోగూడ జోడిస్తూవుండాలి. అలా జోడించి ఆత్మయందు తండ్రికి అర్పిస్తూ వుండాలి, క్రీస్తు విజ్ఞాపన ప్రార్ధనతోను ఆత్మ విజ్ఞాపన ప్రార్ధనతోను చేర్చి సమర్పింపబడిన ప్రార్థనలు తండ్రికి తప్పక విన్పిస్తాయి.
పనీతులు, దేవదూతలు మరియమాత వీళ్లంతాగూడ మనకోసం విజ్ఞాపనం చేస్తుంటారు. వాళ్ళ విజ్ఞాపనలను మనం తప్పకుండా వినియోగించుకోవాలి. కాని వీళ్ళ విజ్ఞాపనలకంటె దైవ వ్యక్తుల విజ్ఞాపనలను వాడుకొని, ఆపిమ్మట సృష్టిప్రాణులైన దేవదూతలు పునీతులు మొదలైన వాళ్ల విజ్ఞాపనలను వినియోగించుకుంటూండాలి.
పూర్వాంశాల్లో విజ్ఞాపన జపాన్ని గూర్చి విచారించాం. మూడవరకపు బైబులు జపం పశ్చాత్తాప ప్రార్ధనం. కనుక ఇకమీదట పశ్చాత్తాప ప్రార్థనను గూర్చి ఆలోచిద్దాం.
3. పశ్చాత్తాప ప్రార్ధనం
22. తమ పాపాలను ఒప్పకుంటూ - మత్త 1,6
తొలి మానవుడైన ఆదాము మొదలుకొని ప్రతి మనుష్యప్రాణి పాపం చేస్తూనే వచ్చాడు. కాని బైబుల్లోని స్త్రీపురుషులు బలహీనతవల్ల పాపం చేసినా, మళ్లా పశ్చాత్తాపపడి ప్రభువుతో సమాధాన పడ్డారు. మనమూ వీళ్ళు పోయిన మార్గాన్నేపోతూండాలి. స్వీయ పాపాల కోసం పశ్చాత్తాపపడుతూండాలి.
స్నాపక యోహాను క్రీస్తునకు పురోగామి. అతడు క్రీస్తుకోసం ప్రజలను సిద్ధం జేసాడు. ఈలా సిద్ధం జేసిన కార్యాల్లో అతడిచ్చిన జ్ఞానస్నానం గూడ ఒకటి. ఇది నూతవేదప జ్ఞానస్నానం కాదు. పూర్వవేదపు ప్రజల్లో అమల్లోవున్న ఓ రకపు శుద్దీకరణ కర్మ యోహాను బోధ విన్నవాళ్లు పశ్చాత్తాపం చెంది, తమ పాపాలను ఒప్పకొని, జ్ఞానస్నానం పుచ్చుకొన్నారు. పాపపు మానవులమైన మనం కూడా మన పాపాలకు పశ్చాత్తాపపడుతూండాలి. దేవుని యెదుట మన తప్పిదాలను ఒప్పకొంటూండాలి.