పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సింహాసనాన్ని అధిరోహించి అన్ని జాతులను పరిపాలిస్తాడు. యావే ప్రభువులాగే క్రీస్తుకూడా రాజు. ఐనా అతడు లౌకిక రాజు కాదు. ఆధ్యాత్మికరాజు.ఒకే మందా, ఒకే కాపరీ ఒకే రాజు వుండే శుభదినం కొరకు మనం ప్రార్థించాలి. విశ్వలోకానికి రాజైన ప్రభువు మన హృదయానికి కూడ రాజు కావాలి. దైనందని జీవితంలో దైవరాజ్యాన్ని గూర్చిన విలువలు మనలను నడిపిస్తుండాలి. రాజాధిరాజైన ప్రభువుకి మనం నిరంతరం మొక్కుతుండాలి.

48. దేవుని పర్వతమైన సియోను

ఇది సియోను కీర్తన. ప్రభువు సియోనులో వసిస్తుంటాడు. అది లోకానికంతటికీ ఆనందాన్ని చేకూర్చే నగరం. ప్రభువే దాన్ని కాపాడుతుంటాడు కనుక శత్రువులు దాన్ని జయించలేరు. సియోను చుట్టు తిరిగి దాని వైభవాన్ని గమనించమని కీర్తనకారుడు యాత్రికులను కోరాడు. తాము చూచినదానిని తమ బిడ్డలకు కూడ తెలియజేయమని ఆదేశించాడు. సియోను తిరుసభకు, మన హృదయానికీ గూడ చిహ్నంగా వుంటుంది. ప్రభువు సియోనులోలాగ మన హృదయంలో కూడ వసించాలని కోరుకొందాం.

49. సంపదలు అశాశ్వతాలు

ఇది జ్ఞానకీర్తనం. కీర్తనకారుడు ఇహలోక సంపదలను గూర్చి మననం చేసికొని తన భావాలను ఈలా వివరించాడు. మనం ఈ లోకంలోకి వస్తూ సంపదలను తీసికొని రాలేదు. ఇక్కడినుండి వెళ్తు వాటిని వెంటబెట్టుకొనిపోము. వాటిని ఇతరులకు వదలి పోవలసిందే. సంపదలు మనలను చావునుండి కాపాడలేవు. నరులందరూ వధకు గురైన మృగల్లాగ చావవలసిందే. కాపరి గొర్రెలను తోలుకొని పోయినట్లుగా మృత్యువు మనలను పాతాళలోకానికి తోలుకొని పోతుంది. కనుక సొత్తుని నమ్మకొనేవాడు చెడతాడు. ప్రభువుని నమ్మి అతన్ని పూజించేవాడు బాగుపడతాడు. ప్రభువు మన ప్రాణాలను కాపాడి మనలను తన దగ్గరికి చేర్చుకొంటాడు. కనుక ఈ లోకసంపదలు కాక ప్రభువే మనకు అండా దండా కావాలని ప్రార్థిద్దాం.

50. నిజమైన ఆరాధనం

ఇది హెచ్చరిక కీర్తన. ఇది చిత్తశుద్ధిలేని దేవాలయారాధననూ కర్మకాండనూ నిరసిస్తుంది. యిస్రాయేలీయులు దేవళంలో జంతుబలులు సమర్పించేవాళ్లు. కాని దేవుడు ఈ బలులతోనే సంతృప్తి చెందడు. అతడు ఎడ్ల మాంసం తినడు, మేకల నెత్తురు త్రాగడు. ప్రభువు కోరేది చిత్తశుద్ధికల ఆరాధనం, కృతజ్ఞతావందనం. దైవచిత్త ప్రకారం జీవించడం. దేవుని ఆజ్ఞలు పాటించడం.తన ఆజ్ఞలను పాటించనివాణ్ణి దేవుడు అంగీకరించడు. కనుక ప్రభువు కట్టడలను పాటించి అతని చిత్తప్రకారం జీవించే భాగ్యాన్ని అడుగుకొందాం.