పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపవాసాలూ బలులూ చాలులే అనే భావం ప్రచారంలోకి వచ్చింది. ప్రజలు సాంఘిక
న్యాయమూ సోదరప్రేమా అంతముఖ్యం కాదులే అనుకొన్నారు. ఈలాంటి తప్పడు
భావాలను ప్రవక్తలు ఖండించారు. ఉదాహరణకు యెషయా ఈలా అన్నాడు :
"నిరంతరమూ మీరర్పించే ఈ బలులు నాకెందుకు?
మీరు దహనబలిగా అర్పించే పొట్టేళ్లూ
కోడెదూడల క్రొవ్వూ నాకు విసుగుపుట్టిస్తున్నాయి
ఎడ్ల నెత్తురూ, మేకల నెత్తురూ నాకు గిట్టవు
నా దేవళంలో ఆరాధించడానికి వచ్చేపుడు
మిమ్మ వీటన్నింటిని తీసికొని రమ్మన్నదెవరు?
మీ కొరగాని బలులు నాకిక వద్దు
వాటి పొగను నేను చీదరించుకొంటున్నాను
మీ అమావాస్య పండుగలు, విశ్రాంతిదిన పండుగలు
మీ జాతరలు నాకు అసహ్యంగా వున్నాయి
వాటిని నేనిక భరించలేను, సహించలేను
మీరు ప్రార్ధనకై చేతులెత్తినపుడు
నేను మీ మొగంగూడ చూడను
మీరు ఎన్ని జపాలు చేసినా నేను విననే వినను
మీరు వట్టి నరహంతలు” - 1, 11-15

సాంఘిక న్యాయాన్ని పాటించని ఆరాధనను ప్రవక్తలు తెగడిన తీరు ఈలా
వుంటుంది. కాని ప్రవక్తలు ఈ యారాధనను ఎందుకు ఖండించారా అని ఆలోచిస్తే
మూడు కారణాలు కన్పిస్తాయి.

1) అపవిత్రారాధనం

మొదటిది, అది అపవిత్రారాధనం. పేదల నోళ్ళగొట్టి అన్యాయంగా ఆర్ధించిన సొమ్ముతో చేసే ఆరాధనం అపవిత్రమైంది. ఆలాంటి కైంకర్యాన్నిదేవుడు అంగీకరించడు. అందుకే సీరా ఈలా నుడివాడు:
"అన్యాయంగా ఆర్థించినదాన్ని దేవునికి అర్పిస్తే
అది అపవిత్రమైన సమర్పణం ఔతుంది
దుర్మార్గుల కానుకలను దేవుడు అంగీకరించడు
భక్తిహీనుల బలి మహోన్నతునికి సమ్మతంకాదు