పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నతనికి తిరిగి ఇచ్చివేయాలి. కప్పకొనడానికి అతనివద్ద ఉన్నదదే. అతడు వంటిమీద కప్పకొనే నిలువుటంగీ అదే. అదికాస్త తీసికొనిపోతే అతడేమి కప్పకొని పండుకొంటాడు? అతడు మొరపెట్టుకొంటే నేనతనిమొర వింటాను. నేను దయామయుణ్ణి' - నిర్గ 22, 25-27. ఈ నియమాన్నిబట్టి యూదులు యూదులదగ్గర వడ్డీ తీసికోగూడదు. కాని అన్యజాతులవాళ్ళ వద్దనుండి మాత్రం వడ్డీ పుచ్చుకోవచ్చు - ద్వితీ 23,20. ఇంకా యిస్రాయేలీయులు తోడి యూదుల నుండి తిరుగలిరాతిని కుదువ సొమ్మగా తీసికోగూడదు. అలా చేస్తే అతని జీవనాధారం పోతుంది - 24,6. ఆలాగే వితంతువు కట్టబట్టను తాకట్టుగా తీసికోగూడదు. ఆలా తీసికొంటే ఆవిడ చలిలో ఏమి కప్పకొంటుంది? - 24, 17. ఇంకో సంగతి. పేదవాడికి అరువిచ్చినపుడుగూడ వాడి యింటికిపోయి అతని వస్తువులను కుదువసామ్మగా గుంజుకొని రాకూడదు. అసలు అతనియింటిలో అడుగు పెట్టగూడదు. ఆ దరిద్రుడు తన చేతిమీదగానే వస్తువును వెలుపలికి తెచ్చి యిచ్చినదాకా ఆగాలి. "నీవు పొరుగువాడికి ఏదైనా ఎరువిచ్చినపుడు దానికి బదులుగా ఏవస్తువునైనా కుదువగా తీసికొనడానికై వాని ఇంటిలోకి వెళ్ళకూడదు. నీవు బయటనే వుండాలి, అరువు తీసికొన్నవాడు తాను తాకట్ట వస్తువును నీ వద్దకు తీసికొని వస్తాడు. పైగా అతడు పేదవాడైతే నీవు రాత్రిపూటగూడ అతని తాకట్ట బట్టను అట్టిపెట్టుకోగూడదు. మునిమాపన నీవా బట్టను తిరిగి ఇచ్చివేస్తే అతడు కప్పకొని పండుకొంటాడు. నిన్ను దీవిస్తాడుగూడ, ఈలా చేస్తే ప్రభువు నిన్ను మెచ్చుకొంటాడు" - ద్వితీ 24, 10-13. రెండవది, బానిసలు. యిస్రాయేలు బానిసలకు చాల హక్కులుండేవి. అన్యజాతి బానిసలకు మాత్రం ఏ హక్కులూ వుండేవికావు. హీబ్రూ ప్రజలు మూడు విధాలుగా బానిసలయ్యే వాళ్లు మొదటిది, దొంగతనం చేసి ఆ దొంగిలించిన సొమ్మను తీర్చలేకపోతే బానిసలయ్యేవాళ్లు - నిర్గ 22,2. రెండవది, పేదవాళ్లు తమ్ముతామే బానిసలనుగా అమ్మకొనేవాళ్లు — లేవీ 25,39. మూడవది, తండ్రి ఏండురాని కూతురుని బానిసగా అమ్మవచ్చు. నిర్గ 21,7. పైమూడు రకాల బానిసలూ ఆరేండ్లు మాత్రమే బానిసంచేసి ఏడవయేడు స్వేచ్ఛను పొందవచ్చు - నిర్గ 21,2.అలా స్వేచ్ఛను పొంది వెళ్ళిపోయేపుడు యజమానుడు అతనికి కొన్ని గొర్రెలూ, ధాన్యమూ, ద్రాక్షసారాయమూ కానుకగా ఇవ్వాలి - ద్వితీ 15:14. యిస్రాయేలీయుడు యిప్రాయేలు బాలికను బానిసగా గొని తన భార్యను చేసికొంటే, ఆమెవలన అతనికి సంతృప్తి కలుగకపోతే, ఆమెను అన్యులకు బానిసగా అమ్మివేయకూడదు. - నిర్గ 21,2. తండ్రి తాను బానిసనుగా కొన్న బాలికను తన కుమారునికిచ్చి పెండ్లిచేస్తే ఆమెను సొంత కూతురినిలాగే చూచుకోవాలి - 21,9.