పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దివ్యసత్రసాదం శిష్యులకు ఐక్యతను ప్రసాదిస్తుంది. ఒకే రొట్టెను భుజించేవాళ్ళ చాలమంది ఐనాకూడ ఏకశరీరంగా ఐక్యమైపోతారు - 1కొ10, 17. ఈలాగే సోదరప్రేమ కూడ శిష్యులకు ఐక్యతను ప్రసాదిస్తుంది. కనుకనే ప్రభువు తానూ తండ్రీ ప్రేమతో ఐక్యమైయున్నట్లే శిష్యులు కూడ ఒకరితో ఒకరు ఐక్యమైయుండాలని ప్రార్థించాడు- యోహా 17,21. దివ్యసత్రసాదం లాగే సోదరప్రేమ కూడ శిష్యులను ఐక్యంచేస్తుంది. అంటే, దానిలాగే ఇదికూడ క్రైస్తవులకు గుర్తుగా వుంటుంది అని భావం. ఇదికూడ దానంత విలువైంది. ఇవి రెండూ కలసి క్రీస్తుసాన్నిధ్యానికి గుర్తుగా వుంటాయి. ఆదివ్య సత్ర్పసాదాన్ని లాగే ఈ సోదరప్రేమను గూడ ప్రభువే మనకు ప్రసాదించాడు. మనంతట మనం ఈ వరాన్ని ఊహించనైనా ఊహించలేం.

సోదరప్రేమను గూర్చి చెప్పవలసివస్తే యోహాను 13,35 చాల బలమైన వాక్యం. లోకంలో సోదరప్రేమ లేదు. నరునికి నరుడు తోడేలు అన్నట్లుగా ప్రవర్తిస్తుంది లోకం. ప్రపంచంలో సోదరప్రేమను పాటించేది ప్రధానంగా క్రీస్తు శిష్యులు. అలాంటప్పుడు మనలోనే ఈగుణం లోపిస్తే ఇక అంతకుమించిన దౌర్భాగ్యం ఏముంటుంది?

2. యోహాను మొదటిజాబు

15. చీకటీ వెలుగూ - 1యోహా 2,9

ఇంతవరకూ నాల్గవ సువార్తను విలోకించాం. యోహాను మొదటి జాబుకూడ సోదరప్రేమను గూర్చి చాల సంగతులు చెప్తుంది. వీటిని పరిశీలిద్దాం.

ఈ జాబులో వెలుగు సోదరప్రేమకీ, చీకటి సోదరద్వేషానికీ చిహ్నంగా వుంటాయి. భగవంతుడు జ్యోతిర్మయుడు కాని తమోమయుడు కాదు. అనగా అతనిలో ప్రేమేగాని ద్వేషంలేదు. మనం వెలుగులో నడచినప్పుడు ఆ ప్రభువు మార్గంలో నడచినట్లే. అప్పడు మనం తోడిజనాన్నిగూడ ప్రేమిస్తాం. కాని మనం చీకటిలో నడచినప్పడు పిశాచమార్గంలో నడచినట్లే. అప్పడు మనం తోడిజనాన్ని ద్వేషిస్తాం. అసలు దేవుని బిడ్డలకీ దయ్యం బిడ్డలకీ ఒక్క ప్రేమలో తప్పితే తేడా లేదు.

16. మృత్యువూ జీవమూ - 1 యోహా 3,10-15

జీవం సోదరప్రేమకీ, మృత్యువు సోదరద్వేషానికీ, చిహ్నంగా వుంటాయి. తోడిజనాన్ని ప్రేమించేవాళ్ల దేవుని పత్రులు. వాళ్ళల్లో జీవం వుంటుంది. శిష్యులు ఈలాంటి వాళ్ళు. కాని తోడిజనాన్ని ద్వేషించేవాళ్ళ పిశాచపుత్రులు. వాళ్ళు చావుకి గురౌతారు. కయీను ఈలాంటివాడు. మనం ఈ కయీనులాగ ప్రవర్తించగూడదు. మనం తోడిజనాన్ని ప్రేమించినట్లయితే మృత్యులోకం నుండి జీవలోకానికి సాగిపోయినట్లే.