పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోధ. యిర్మీయా యూదుల చరిత్రలో బహుకష్టమైన కాలంలో జీవించాడు. స్వయంగా కష్టాలు అనుభవించాడు. ఆ ప్రభువు ఆజ్ఞపై అవివాహితుడుగా వుండిపోయాడు. ఇతని బోధలూ జీవితమూ కూడ పాఠకులకు ఎంతో సానుభూతిని కలిగిస్తాయి.

విలాపగీతాలు

587లో బాబిలోనియారాజు యెరూషలేము దేవళాన్ని నాశం చేసాడు. దేవాలయ ధ్వంసానికి విలపిస్తూ చెప్పిన శోకగీతాలే ఈ గ్రంథం. ఈ గీతాల్లో ఒక్కోచరణం హీబ్రూ భాషలోని ఒక్కో అక్షరంతో ప్రారంభమౌతుంది. ఈ గీతాల్లోని భావాలు యిర్మీయ భావాలతో సరిపోయినా, వీటి రచయిత మాత్రం అతడు కాడు. ఐనా అతని పేరుమీదిగానే ఈ గ్రంథం ప్రచారంలోకి వచ్చింది. ఈ గీతాల్లో కొన్ని మన తపస్సు కాలంలో వచ్చే పవిత్రవారం ఆరాధనలో వాడతాం.

బారూకు

ఈ పుస్తకం యిర్మియాకు లేఖకుడైన బారూకు పేరు మీదిగా ప్రచారంలోకి వచ్చింది. ఇది పశ్చాత్తాపం, ధర్మశాస్త్రం, ప్రవాసంనుండి తిరిగిరావడం మొదలైన అంశాలను ప్రస్తావించే చిన్న పుస్తకం.

యెహెజ్కేలు

ఈ ప్రవక్త 600 ప్రాంతంలో ప్రజలతోపాటు బాబిలోనియా ప్రవాసానికి వెళ్ళాడు. అక్కడి యూదులు మొదటలో ప్రవాసం స్వల్పకాలం మాత్రమే వుంటుందనుకొన్నారు. కాని ఈ ప్రవక్త అది దీర్ఘకాలం కొనసాగుతుందని రూఢిగా తెలియజేసాడు. ప్రవాసంలో నిరుత్సాహం చెందిన యూదులను ప్రోత్సహించాడు. చనిపోయిన యూదమతం మళ్ళావుత్ధానమవుతుందనీ,ధ్వంసమైన దేవాలయాన్ని మళ్ళా నిర్మిస్తారనీ బోధించి ప్రజల్లో ఆశాభావాలు రేకెత్తించాడు, ప్రజలు పవిత్రులైన యాజకులుగా జీవించాలని హెచ్చరించాడు. ఇతడు స్వయంగా యాజకుడు. కనుక యాజకులు మెచ్చుకొనే దేవాలయం, ఆరాధన, కర్మకాండంలో పాటించవలసిన శుద్ధి, ధర్మశాస్తానుసరణం మొదలైన భావాలు ఇతని బోధల్లో విరివిగా కన్పిస్తాయి. ఇతని ప్రవచనం నాల్గు పెద్ద దర్శనాల రూపంలో వుంటుంది. నరుడు నూత్న హృదయాన్ని నూత్న ఆత్మనీ పొందాలనేది ఇతని ప్రధాన బోధ.

దానియేలు

ఈ గ్రంథం 165 ప్రాంతంలో పుట్టింది. ఆ కాలంలో అంటియోకస్ ఎపిఫానెస్ అనే గ్రీకురాజు యూదులను హింసిస్తుండేవాడు. ఈ హింసకు గురైనవాళ్ళకు ఓదార్పు