పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



38. నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలంలో నివసిస్తుంటాను. ఐనా వినయాత్ములైన పశ్చాత్తాపమనస్కుల చెంతగూడ వసిస్తుంటాను

-యోష 57,15

ప్రభువు ఊర్ధ్వలోకంలో వుంటాడు. అతడు మహోన్నతుడు. ఐనా ఆ ప్రభువు మంటిమీదికి వచ్చి నరులతోను వసిసూంటాడు. కాని, ఏలాంటి నరులతో? వినయవంతులూ, పశ్చాత్తాప హృదయులూ ఐన నరులతో వినయవంతులు అంటే ప్రభువుకి అంత ప్రియం. నరుడు గర్వంవలన తోడి మానవునికేగాదు, భగవంతునికిగూడ అప్రియుడౌతూంటాడు. అందుకే ఓ వేదవాక్యం "ప్రభువు వినయవంతులకు దీవెనలిస్తాడు. కాని గర్విషులను అణగదొక్కుతాడు అంటుంది-” యాకో 4,6. వినయవంతుడైన సుంకరీ గర్వాత్ముడైన పరిసయుడూ - వీళ్లిద్దరి సంగతీ మనకు తెలుసు. ఫలితాంశమేమిటంటే వినయవంతుడు భగవంతుని మన్ననకు పాత్రుడౌతాడు.

39. నేనూ నీకు శిక్ష విధింపను. ఇక వెళ్ళి పాపం చేయకుండా బ్రతుకు

- యోహా 8,11.

రంకుటాలిని రాళ్ళతో కొట్టి చంపమంటుంది మోషే ధర్మశాస్త్రం. క్రీస్తు బోధనాకాలంలో యూదులు తమచేజిక్కిన ఓ వ్యభిచారిణిని అలా చంపడానికి పూనుకొన్నారు. శిక్షారులకు శిక్ష విధించడంలో ఆశ్చర్యమేమీ లేదు. కాని ప్రభువు శిక్షారులకుకూడ శిక్ష విధింపలేదు. వాళ్ళను కరుణించాడు, మన్నించాడు. ఇక వెళ్ళి యిలాంటి పాపాలు చేయకుండా బ్రదకండి అని మాత్రం మందలించాడు. అతని కరుణను తలంచుకొంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మన విషయంలో కూడ ఆ ప్రభువు కారుణ్యమయుడుగానే ప్రవర్తిస్తాడు. అతడు మన పాపాలకు తగ్గట్టుగా మనలను శిక్షించినట్లయితే మనమంతా ఇప్పడెక్కడుండే వాళ్ళమో!

40. ఆకాశం నుండి వచ్చే వానా మంచూలాగే నానోటి నుండి వెలువడే వాక్కూ వుంటుంది

- యెష55,10,

ఆకాశం నుండి వచ్చే వానా, మంచూ వ్యర్థంగా ఆకాశానికి తిరగిపోవు. భూమిని తడిపి పైరులను ఎదిగిస్తాయి. పంటలు పండించి సేద్యగానికి అన్నం చేకూర్చిపెడతాయి. ఆలాగే ప్రభువు నోటినుండి వెలువడే వాక్యం గూడ వ్యర్థంగా అతని వద్దకు తిరిగిపోదు. అది నరుని హృదయాన్ని సోకుతుంది. ఆ నరుని గూర్చిన భగవంతుని సంకల్పం నెరవేర్చి తీరుతుంది. అనగా వాన పొలంలో పంటలు పండించినట్లే దేవుని వాక్కుమన హృదయంలో మంచి కోరికలు పుట్టిస్తుంది. కనుక భక్తుడు దైవవాక్యాన్ని పఠించాలి. ఆలించాలి. ఆ వాక్యం ప్రకారం హృదయాన్ని సంస్కరించుకోవాలి.