పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రారంభమైంది. ఇక్కడ ప్రభువు దాహం భౌతికమైంది మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనది కూడ, అతడు నరులను రక్షించడానికి ఎప్పడూ దాహం గొంటూనే వుంటాడు. ఇక్కడ ఈ సమరయ మహిళను పాపం నుండి రక్షించడానికి దాహం గొన్నాడు. తరువాత నరులను రక్షించడానికి సిలువ మిూద కూడ దాహం చెందుతాడు - యోహా 19,28. ఓ యూదుడు తన్ను నీళ్లీయమని అడగడం చూచి ఆవిడ విస్తుపోయింది. యూదులూ సమరయయులూ ఒకేజాతివాళ్లయినా బాబిలోనియా ప్రవాసానంతరం విడిపోయారు. పరస్పరవైరాలు పెంచుకొన్నారు. ఒకరి నుండి ఒకరు ఇచ్చిపుచ్చుకొనేవాళ్ళ కాదు. ఒకరి యిండ్లల్లో ఒకరు తిని త్రాగేవాళ్ళు కాదు. అందువల్ల క్రీస్తు తన చేతినీళ్ళు త్రాగుతాడా అని ఆమె ఆశ్చర్యపడింది. క్రీస్తు యూదుడు కావడం చేత అతనిపట్ల ఆమెకు ఓ రకమైన అనిష్టభావం ఏర్పడింది. కనుక మొదటలో అతనిలో మెస్సీయాను గుర్తించలేకపోయింది. తరచుగా దేవుడు మనకు తోడినరుల్లో సాక్షాత్కరిస్తుంటాడు. కాని కొన్ని కారణాల వల్ల ఆ నరుల పట్ల మనకు అనిష్ట భావం పడుతుంది. అందుచే వాళ్ళల్లో దేవుణ్ణి గుర్తించలేక పోతుంటాం. అలా దైవదర్శనాన్ని కోల్పూతూంటాం. ఇక్కడ యిూమె వదంతంలో అచ్చంగా ఇదే జరిగింది.

2. ప్రభువు ఆ స్త్రీ తన్ను గుర్తుపట్టాలని కోరాడు, 10-12

క్రీస్తు ఆ మహిళ నుండి రెండంశాలు కోరాడు. మొదటిది, దేవుని వరమైన తన్ను ఆమె గుర్తుపట్టాలని. రెండవది తననుండి జీవజలం అడుగుకోవాలని. ఈనాడు మనం కూడ తన్ను గుర్తుపట్టాలనీ, తన నుండి జీవజలం అడుగుకోవాలనీ ప్రభువు అభిలషిస్తాడు.

జీవజలాలనే పదాన్ని ఆవిడ అపార్థం చేసికొంది. యూదులు చెరువులు, బావులు మొదలైన వాటిల్లో నిల్వవుండే నీళ్ళను మృతజలాలు అనేవాళ్ళు ఊటలనుండీ కాల్వల నుండీ పారే నీళ్ళను జీవజలాలు అనేవాళ్లు, మొదటిదాని కంటె రెండవది శ్రేష్టమైన జలం. కనుక ప్రభువు తాను జీవజలాలనిస్తానని చెప్పగా సమరయ మహిళ అతడు ఏ వూట నీల్లో తీసికొనివస్తాడని అపార్థం చేసికొంది. అతడు యాకోబు బావి నీటికంటె గూడ శ్రేష్టమైన నీళ్ళు తీసికొని రాగలడా అని అనుమానించింది.

క్రీస్తు బోధను అతని శ్రోతలు అపార్థం చేసికోవడమూ ఆయపార్థం ద్వారా అతడు తన బోధను మరింత విపులంగా వివరించి చెప్పడమూ యోహాను ప్రయోగించే రచనా పద్ధతి. మరో సందర్భంలో ప్రభువు పరలోకాన్నుండి దిగివచ్చిన ఆహారాన్ని దయచేస్తానని చెప్పాడు. యూదులు ఆ వాక్యం అపార్థం చేసికొన్నారు. అది భౌతికాహారమని బ్రాంతి పడ్డారు. కనుక వాళ్ళు ఆ యాహారాన్ని మాకు నిత్యమూ దయచేయమని వేడుకొన్నారు. అప్పడు ప్రభువు తానిచ్చే ఆహారం భిన్నమైందని వివరించి చెప్పాడు – యోహా 6,34. అలాగే యిక్కడకూడ సమరయ స్త్రీ అపార్ధాన్ని ఆధారంగా చేసికొని జీవజలమంటే యేమిటో వివరించి చెప్పడానికి పూనుకొన్నాడు. 263