పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతని సంతతినుండి మెస్సియాను పుట్టించడం కొరకే గదా? కనుక అబ్రాహాము మొదటినుండి క్రీస్తుదినాన్ని చూడాలని ఉవ్విళ్ళూరాడు - యోహా 8, 56. అతడు తన దీవెనలను క్రీస్తుకి గూడ సంక్రమించేలా చేసాడు.

దేవుడు రక్షణ చరిత్రలో ఒక్కోసారి ఒక్కో వ్యక్తిని ఎన్నుకొని అతనిద్వారా తనదీవెనలు పెక్కుమందికి సంక్రమించేలా చేస్తాడు. పూర్వవేదంలో అబ్రాహాము అలాంటివాడు. నూత్నవేదంలో క్రీస్తు అలాంటివాడు. క్రీస్తుని నమ్మేవాళ్ళంతా వాళ్ళు యూదులైన అన్యులైనా - ఆ క్రీస్తు ద్వారానే అబ్రాహాము దీవెనలు పొందుతారు. దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దీవెనలు క్రీస్తుద్వారా అన్యజనులకు అందుతాయి — గల 3, 14 వారి విశ్వాసమే వారిని విశ్వాసులందరికీ తండ్రియైన అబ్రాహాముకి బిడ్డలనుగా జేస్తుంది - రోమా 4,11. కనుకనే పౌలు “మీరు క్రీస్తుకి చెందినవారైతే అబ్రాహాము సంతానమే. అబ్రాహాము పొందిన వాగ్దానాలకు మీరు కూడ వారసులౌతారు" అని వ్రాసాడు - గల 3,29.

దేవుడు అబ్రాహాముకి గొప్ప బహుమతిని ఇస్తానన్నాడు - ఆది 15,1. ఈ బహుమతి అతని సంతానమే. ఈ సంతానంలో క్రీస్తు వున్నాడు. మనమూ వున్నాం. ఇంకా రాబోయే తరాలవాళ్ళూ వున్నారు. ఈ లోకవాసులూ పరలోకవాసులూ కూడ వున్నారు. యూదులు మోక్షాన్ని అబ్రాహాము వొడి లేక రొమ్ము అని పిల్చారు. అనగా, అతని దాపలో మనం సురక్షితంగా వుండిపోతామని భావం - లూకా 16,22. మనమంతా చనిపోయాక అబ్రాహామున్నచోటికే వెత్తాం. క్రీస్తుని నమ్మినవాళ్ళందరికీ అక్కడ కలకాలం అబ్రాహాము తండ్రిగా వుంటాడు.

ప్రార్థనాభావాలు

1. అబ్రాహాము ప్రధాన పుణ్యం విశ్వాసం. ఈ విశ్వాసం అతని జీవితంలో మూడుసార్లు వెల్లడియైంది. మొదటిసారి, ప్రభువు అతన్ని పిల్చినపుడు. కాల్డియా దేశంలో దేవుడు తన్ను పిలువగానే అబ్రాహాము ఆ కొత్తదేవుణ్ణి నమ్మి తన సొంతదేశాన్ని వదలిపెట్టి నూతదేశమైన కనానుకు తరలివచ్చాడు- ఆది 12,1. రెండవసారి, ముసలిప్రాయంలో దేవుడు అతనికి సంతానాన్ని కలిగిస్తానని చెప్పినపుడు. ఆ భక్తుడు తానూ తన భార్యా వృద్దులైనాకూడ దేవుని వాగ్హానం ప్రకారం తమకు సంతానం కలుగుతుందని నమ్మాడు. ఆ నమ్మకాన్ని జూచే దేవుడు అబ్రాహాముని నీతిమంతునిగా గణించాడు - 15,4-6. మూడవసారి, దేవుడు ఈసాకుని బలి యిూయమని అడిగినపుడు. దేవునిపట్లగల భయభక్తులచే