పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



11. బాధలు ముగియగా అతడు మళ్ళా ఆనందిస్తాడు
నీతిమంతుడైన నా సేవకుడు
పెక్కుమంది దోషాలను భరిస్తాడు
అతన్ని చూచి నేను వారి తప్పిదాలను మన్నిస్తాను
12. అతడు తన ప్రాణాలను అర్పించాడు
దుష్టుడుగా ఎంచబడ్డాడు
పెక్కుమంది దోషాలను భరించి
వారి పాపాల పరిహారం కొరకు విజ్ఞాపనం చేసాడు
కనుక నే నతన్ని గొప్పవాణ్ణి చేస్తాను
ఘనుల్లో వొకణ్ణిగా గణిస్తాను.”

నాలు గీతాల్లోను ఇది సుప్రసిద్ధమైంది. దీనిలో విరోధులు సేవకుణ్ణి వధించారు. కాని భక్తుడు విరోధుల తరపున చనిపోయాడు. అతని మరణం వాళ్ళకు పాపపరిహార బలి ఐంది. ప్రభువు అతని నిర్దోషత్వాన్ని నిరూపించి అతనికి పునర్జీవాన్ని ప్రసాదించాడు.

52, 13. ఇవి యావే పలుకులు. సేవకుడు అపజయాలకు వెరవకుండా బోధించాడు. శత్రువులు అతన్ని బాధించి, వధించి, సమాధి చేసారు. అతడు కుష్టరోగిలాగ కన్పించాడు. కాని మరణానంతరం ప్రభువు అతన్ని మహిమపరచి అతనికి వుత్దానాన్ని దయచేసాడు. అతని విజయాన్ని చూచి జనం ఆశ్చర్యపోతారు.

14. ప్రజలుమాత్రమే కాక రాజులకూడ సేవకుని విజయానికి విస్తుపోతారు. నవ్విన నాపచేనే పండిందికదా అని నిశ్చేష్టులౌతారు. ఊరూ పేరూ లేనివాడు కడకు విజయాన్ని సాధించాడు కదా అనుకొంటారు.

53,1. ఇవి ప్రజల పలుకులు. ప్రజలు భక్తుని బాధించి చంపివేసారు. కాని యావే అతన్ని మహిమపరచాడు. ఈ సంగతిని ఎవరైనా ముందుగా ఊహించారా? అర్థం చేసికొన్నారా? లేదు.

2. సేవకుడు ఊరూపేరూ లేని పేద కుటుంబంలో పట్టాడు. మెస్సీయా యిూషాయి వంశంలో పుట్టే మొలకలాంటివాడు - యెష 11,1. సేవకుడు కూడ ఎండిన నేలలో మొలచిన మొలక, అనగా అనామకుడని భావం. యావే అలాంటివాణ్ణి తన కార్యాన్ని సాధించడానికి ఎన్నుకొన్నాడు.

3. సేవకుడు బాధలు అనుభవించి కుష్టరోగిలా తయారయ్యాడు. జనం అతనివైపు చూడ్డానికి గూడ ఇష్టపడలేదు. అతడు తన పాపాల కొరకే బాధలు అనుభవించాడు అనుకొన్నారు. కనుక ఎవరూ అతన్ని విలువతో చూట్లేదు.