పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. కూటసాక్ష్యం

మరునాడు యోవాకీము ఇంటిలోనే సూసన్నకు, తీర్పు చెప్పారు. ఆమె తమ వాంఛను తీర్చలేదు కనుక న్యాయాధిపతులు ఆమెను చంపించాలని కుట్రపన్నారు. ఆ మహిళ బంధువులతో, బిడ్డలతో సభ మధ్యకు వచ్చింది. నిందితురాలిగా ముఖంమీద ముసుగు వేసుకొని వుంది. న్యాయాధిపతులు ఆమె సౌందర్యాన్ని చూచి ఆనందించాలన్న కోర్కెతో ఆమె ముసుగును తొలగించమని ఆజ్ఞాపించారు. దోషిమీద నేరం మోపేవాళ్ళు అతని తలమీద చేతులు పెట్టి నేరం విన్పించాలి — లేవీ 24, 14. ఈ నియమం ప్రకారం ముసలివాళ్ళు సూసన్న తలమీద చేతులు పెట్టి “ఈమె తోటకు వచ్చి పనికత్తెలను పంపివేసి తలుపులుమూయించి ఒక యువకునితో వ్యభిచరించింది. మేము ఆ ప్రక్కనేవుండి ఇదంతా గమనించి ఆమె దగ్గరికి వచ్చాం. ఆ యువకుడు మాకు దొరకకుండా పారిపోయాడు. ఈమె చిక్కింది. ఆ యువకుని పేరుమాత్రం చెప్పడంలేదు" అని కూటసాక్ష్యం పలికారు. వాళ్ళ యూద సమాజానికి పెద్దలూ న్యాయాధిపతులూ కూడ. కనుక జనం సూసన్న అభిప్రాయాన్ని తెలిసికోకుండానే వాళ్ళు చెప్పింది నమ్మి ఆమెకు మరణశిక్ష విధించారు. యూదుల మరణశిక్ష రాళ్ళతో కొట్టి చంపడం.

ఆ భక్తురాలు మరణానికి ముందు పెద్దగా ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేసింది. ప్రభూ! నీకు రహస్యాలన్నీతెలుసు. ఈ దుష్టులు నా మీద మోపిన నేరం పచ్చి అబద్ధం. నీవు నన్ను కాపాడవా అని వేడుకొంది. నిజానిజాలు తెలిసిన దేవుడు ఆమె మొర విన్నాడు.

ఆ మహిళను చంపడానికి తీసికొని పోతూండగా దేవుడు దానియేలును ప్రేరేపించి అతనికి జరిగిన సంగతిని తెలియజేసాడు. అతడు కూటసాక్ష్యంవల్ల సంభవించిన ఈ మరణాన్ని నేను అంగీకరింపను అని అరచాడు. అతని ఆదేశం ప్రకారం జనులందరు మళ్ళా యోవాకీము ఇంటికి తిరిగి వచ్చారు. ఈమారు దానియేలే తీర్పు చెప్పడానికి పూనుకొన్నాడు. వృద్దులు చెప్పిన సాక్ష్యాన్ని పరిశీలించి సత్యాసత్యాలు తెలిసికోవడం ముఖ్యమని అతడు గ్రహించాడు.

అతడు ఇద్దరు పెద్దలను వేరుపరచాడు. మొదటి వానిని పిలిపించి నీవు అన్యాయపు తీర్పులు చెప్పడంలో దిట్టవు. ఈ యిద్దరు ఏ చెట్టుక్రింద పాపం చేస్తూండగా నీవు చూచావో చెప్ప అన్నాడు. న్యాయాధిపతి మస్తకి చెట్టు క్రింద అన్నాడు. అంతట రెండవవానిని పిలిపించి నీవు కనానీయులవలె విగ్రహారాధకుడివి. యిప్రాయేలు స్త్రీలను