పుట:Bhoojaraajiiyamu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

భోజరాజీయము ఆశ్వా 6


మనసులోనిద యై మెలంగుచుండు; బ్రాహ్మణోత్తములు ప్రతిదినంబును
నతనిగృహంబున నాహారంబు గొని దీవించుచుం బోదు రిట్లు చెల్లుచుండ
నొక్కనాఁ డాగృహస్థునితో గృహిణి యి ట్లనియె.

130


క.

'మీ రెల్లప్పుడు విప్రస
మారాధన తత్పరాత్ములయి వారల కా
హారములు పెట్టుచుండుదు
రారయ నందు నగుసిద్ధి యది యెద్ది యొకో.'

131


క.

అనవుడుఁ 'దత్ఫల మింతిం
తని యేనును మున్ను విన్నయది లే దబలా!
నను నీ విపు డడిగితి గా
వునఁ జెప్పెద విప్రపుంగవులు రా నిమ్మా.'

132


చ.

అని తన యింటి కద్దివసమం దరుదెంచిన విప్రజాతి క
య్యనఘుఁడు షడ్రసాన్వితము లైన పదార్థచయంబుతోడ భో
జన మిడి వారు తృప్తు లయి చల్లనినీడ వసించి యుండ న
వ్వనితయుఁ దాను వారలకు వందన మొప్పఁగఁ జేసి యి ట్లనున్.

133


క.

'ఊహించి మాకు నొక సం
దేహము వాపుటకు నరుగుదెంచితిమి మహో
త్సాహమున విప్రవర్యుల
కాహారము పెట్టుసుకృత మది యెట్టిదియో?

134


క.

మా కేర్పడ నానతి యీ
రే కృపతో' ననుడు వార లిందఱు మది నా
లోకించి కొలఁది గానక
మూకత్వము దాల్చి రపుడు మూఢుల భంగిన్.

135


ఉ.

వారలఁ జూచి విప్రు 'లిటువంటి మహాత్ములు మీ రెఱుంగరే
యూరక యుండు టేతెలివి యుక్తివిహీనుల భంగి' నావుడున్
వారలలోన మేటి యగువాఁ డొకవిప్రుఁడు 'విప్రజాతి కా
హారము పెట్టునట్టి ఫల మన్యు లెఱుంగరు భూసురోత్తమా!

136