పుట:Bharatiyanagarik018597mbp.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీ విగ్రహము 'మహర్షిభవన' మను నాలయములో నొకనాడు కుంభలగ్నమున బ్రతిష్ఠింప బడెను. గజయన రాజు బ్రాహ్మణ భక్తుడుగూడ నైయుండెను.

క్రీ. శ. 8 వ శతాబ్దినాటి కీశైవరాజులు మధ్యజావాలో క్షీణించిరి. ఈ భాగమంతయు సుమాత్రాద్వీపమునుండి రాజ్యమేలుచుండిన శైలేంద్ర వంశీయుల యాధిపత్యమునకు లోనయ్యెను. ఈ కాలముననే జావాద్వీపమున శిల్పకళ యపూర్వశోభను గాంచినది. క్రీ. శ. 778 లో శైలేంద్ర వంశపు రాజొకడు మధ్యజావాలోని కలస్సనులో నత్యద్భుతమగు నొక దేవాలయమును నిర్మించి 'తారా' యను బౌద్దదేవతనందు బ్రతిష్ఠించెను. ఈ రాజు లందరును మహాయానబౌద్దులు. ఇంతటినుండియు మహాయాన శైవమత సమ్మేళన మూలమున శిల్పకళకు నూతనోత్తేజము గల్గినది. జావాశిల్పములలో నగ్రగణ్యమును, విశ్వవిఖ్యాతమునగు బొరొబుదుర్ దేవాలయ మీ కాలము నాటిదే. ఈ శిల్పములు భారతదేశమునందలి గుప్తవంశీయుల శిల్పముల కెనయగుచున్నవి. క్రీ. శ. 10 వ శతాబ్దమున జావాద్వీపమునందలి విదేశీయ పరిపాలన మంత మందెను. ఇంతవరకు నాద్వీపమునందలి తూర్పు భాగమున దలదాచుకొనిన హిందూరాజులు, శైలేంద్రరాజ ప్రతి నిధుల నోడించి మధ్యజావాను స్వాధీనము చేసికొనిరి. ఇటుపై నీదేశమునం దనేకములగు హిందూదేవాలయములు బయల్వెడలినవి. వీనిలో 'ప్రాంబసన్‌' ఆలయ మగ్రగణ్యము. ఇందు రామాయణమంతయు శిల్పమున జిత్రింపబడినది. పదియవ శతాబ్దాంతమునకు మధ్యజావా రాజ్యము నశించినది. తుదకొక యగ్నిపర్వత మీ దేశమును నాశమొనర్చుటచే బ్రజలు దీనిని విడనాడిరి.

తూర్పు జావా :- పిమ్మట యవద్వీపమునందలి దూర్పు భాగమునందొక రాజ్యము బయల్వెడలినది. దీనిని సిందక్ అనునతడు నిర్మిం