పుట:Bharatiyanagarik018597mbp.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మానవసంఘ మంతటికిని ధర్మోపదేశ మొనర్చెను. ఈచక్రవర్తి మహాసందేశము సిరియా, ఈజిప్టు, సైరినీ, మాసిడోనియా, ఎపిరస్, సింహళము, స్వర్ణభూమి మున్నగు దూరదేశములందు సహితము ప్రతిధ్వనించెను. అహింస, ప్రేమ యను మరి రెండాదర్శములను యీచక్రవర్తి సమకాలిక ప్రపంచమున కొసంగెను.

క్రీ. పూ. 5 వ శతాబ్దినుండి క్రీస్తుశకారంభము వరకునుగల కాలమునాటి భారతదేశచరిత్రము మరియొక ముఖ్యాంశమును దెలుపుచున్నది. మొదట పర్షియనులును పిమ్మట యవనులు నీదేశపు పశ్చిమోత్తరప్రాంతమును వశపరచుకొనిరి. ఆకాలమునం దాయాజాతుల వారట స్థిరపడి స్థానికులతో గలసిపోయిరి. పిమ్మట శక, పహ్లవ, యూఏచి జాతులవా రీదేశముపై దండెత్తివచ్చి యిట స్థిరపడి రాజ్యములనుగూడ నిర్మించిరి. కాని యనతికాలమునకే వారు తమ విదేశీయవ్యక్తిత్వమును గోల్పోయి' పరిపూర్ణముగ భారతీయులై, భారతీయాచార వ్యవహారములను పరిగ్రహించి, హిందూబౌద్దమతముల నవలంబించి, భారతీయులలో గలసిపోయిరి. "దీనినుండి సర్వజన సమాదరణము పూర్వభారతీయుల మరియొక యాదర్శమని తెలియుచున్నది.

ఈవిధమున సర్వజాత్యుద్దరణము, సర్వసంతరణము, అహింస, ప్రేమ, ధర్మసంస్థాపనము, సర్వజన సమాదరణమునను నుత్తమాదర్శములమూలమున ప్రాచీనభారతీయులు నాటి ప్రాచ్యపాశ్చాత్యప్రపంచములపై నాధ్యాత్మిక దిగ్విజయమొనర్చి విశ్వమానవకల్యాణమును చేకూర్చిరి. మధ్య యుగమునాటి పాశ్చాత్యదేశమునందలి సాహసవంతులవలెనే నాటి భారతీయ పండితులును, యువకులును, దేశాంతర విజయములను సంపాదించుటకై యువ్విళ్ళూరుచుండిరి. ఒక్కటియమ్ము సహస్రస్థలముల ప్రతిబింబించుచు నాటి భారతభూమి సువిశాలమగు నాధ్యాత్మిక సామ్రాజ్యమునకధినేతయై యొప్పుచుండెను.