పుట:Bhaarata arthashaastramu (1958).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలపు కాలక్రమముగ మేదురంబైన స్నేహభావమై పరిణమిల్లుననుట మనకవులకుదప్ప దక్కిన యెల్లవారికిని సువ్యక్తమైనస్థితి. నిజము చూడబోయిన కామోద్రేకమునకన్న నియ్యది బాలాఢ్యము. స్థిరతరమును. అనురాగముయొక్క వేడిమి యుపశమించినను పరస్పర బాంధవము విస్ఫారమగుననుటకు సందియమేల? అనురాగపురాశి మొత్తముమీద నెక్కువయగుననుటకు దార్కాణము వలయునా? చూడుడు. పెండ్లియైన క్రొత్తలో భార్య చనిపోయెనేని పురుషుడు గోడు గోడున నేడ్చును. నెత్తి మోదుకొనుచు "అయ్యో! పాపము! పసిప్రాయము ఏమిసుఖముల గాంచెను?" అని యాయక విషయమై పశ్చాత్తాపముతో తనకు వియోగము ప్రాప్తించెగదా యను తాపంబుతోను శోకానల దందహ్యమాన మానసుండైనను స్నేహబంధము లల్పము లౌటచే కొలదికాలమునకే యంతయు మఱచి ద్వితీయ వివాహోన్ముఖుండగును. మఱియు ప్రాచీనాచార పరాయణుడైనచో దివసవారములైన దీఱకమునుపే "యీ తిధికి బంధువులందఱు వత్తురు. ఇదే మంచిసమయ" మని దేనిపైననో యొక యెనిమిదేడుల పిల్లపై గన్నువేసి రెండవపెండ్లికి త్వరలో ముహూర్తము నిశ్చయించుమని మధ్యవర్తుల కాళ్ళు గట్టిగా బట్టుకొని యెట్లోయొకరీతి వివాహము జేసికొనును. అనురాగరాశి యంత సాంద్రము గాదనుట యిందుచే విశదము.

పదిపండ్రెండేండ్లు సంసారము చేసినపిమ్మట భార్య గతించిన యెడల నెట్టిక్రూరాత్ముడైననుసరే దిక్కులు దెలియనివా డవును. వెక్కివెక్కి యేడ్వకున్ననేమి? మనస్సులోనె రగిలి కుమిలి యూరక యుండు శోకముకన్న దుస్సహతరమొండుగలదా? "అయ్యో! యెంతమంచిది! ఈయింట లక్ష్మీదేవిగ నుండెను. అందఱిని అరసి పోషించుచుండెనే! ఇక బిడ్డలగతియేమి, నాగతియేమి?" యనుచు నొకరూపము మాత్రముగాక గుణగణమ్ములను దలచి తాపము