పుట:Bhaarata arthashaastramu (1958).pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. చిల్లర వ్యాపారములలో జయము దాల్చునదియై వానియందు వ్యాప్తికి గాలక్రమేణ వచ్చుచున్న దనుట నిజమేయైనను మహా వ్యవహారముల నీపద్ధతికి జొరవ ఇంకనులేదు. అయినను నీపద్ధతి నిస్సంశయముగ గౌరవింపదగినదే. ఎట్లన:-

1. ఆర్థిక మండలమునందలి సమస్త వైషమ్యములకు నియ్యది విఱుగడ.

2. విద్యాభివృద్ధులు మించుకొలది దీనియందలి దోషంబులు పర్యవసానమునొంది గుణంబులుమాత్రము నిలుచును. ఈమార్గ మింకను నారంభదశలోనున్నది. బాల్యచాపల్యము త్వరలో వీడును. నిండు జవ్వనము వచ్చుతఱికి నియ్యది నిష్కల్మష తేజోవిరాజితంబై లోకంబుం బావనంబుజేయును.

3. పరోపకారంబు సహజముగ లీనమైన హృదయముగలవారికి నీపద్ధతి పరమాశ్రయంబు. ఈకాలమున స్వలాభాపేక్షయను తాపమ్మున నెల్లరు దహింపబడియెదరు. బొమ్మలు మొదలైనవానిని తండ్రి యింటికి దెచ్చినతోడనే "నాకేయిండు, నావేయివి, నీవికావు, దూరముగాబో" యని కాట్లాడుచు నాట్లాట మఱచు పసిపిల్లల మాడ్కి లోకము వారు సంపదల విషయమై మూఢవైరంబుందాల్చి యొక్క యెదుటివారి సుఖమునేగాక తమసుఖమును సైతము నశింప జేయుట చూడగా మనుష్యపదవి నుండువారికిని నిట్టి వెఱ్ఱియెత్తునా యని యాశ్చర్యమును దు:ఖమును గలుగకమానవు! మనుష్యులు జ్ఞాన సంపన్నులై రేని ఈ వెఱ్ఱి తనంతట వదలును. అపు డన్యోన్యతా పద్ధతుల నెల్లరు సహజకాములై యవలబింతురు. ఇకముందు గృతయుగమును గనిపించి పోషించుమాత ఈ పద్ధతియేయని త్రికరణ శుద్ధిగ నమ్మువారు కొందఱున్నారు. వీరికి నిదియే నీతిధర్మము, మతము సర్వమును!