పుట:Bhaarata arthashaastramu (1958).pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడ్డులేని స్పర్ధయుండెనేని, వాంఛాపూర్తికి జాలినంత వస్తువు లుత్పత్తికావేని - అనగా గిరాకికన్న సరఫరా తక్కువయైన - వస్తువుల వెలలు హెచ్చును. వ్యవహారులకు లాభ మధికమౌను. కావున స్పర్ధచే నితరులాక్రియకుం బూనుదురు. వస్తురాశి యధికమగును. వెలలు వ్రాలును. మఱియు నమిత రాసులు సిద్ధములై యున్న వెలలు తఱుగును. నష్టము వచ్చును. స్పర్ధయు స్వాతంత్ర్య సంచారము నున్నయెడల కొందఱీ పనులమాని, ఇతర కార్యములకుం జొత్తురు. రాసులు తఱిగి వెలలు ఎగయును. చూడుడు! వెలలు ఒక మితమునకు మించినను దగ్గినను స్పర్ధచేనైన చలనముచే మఱల నామితమునకువచ్చి నిలుచునవిగానున్నవి. ఈమితమెయ్యది? ఎద్దాన నిర్మితము? అనుట యెఱింగితిమేని క్రయ్య క్రేయముల సమత్వసిద్ధికి గారణం బెద్దియనుట యేర్పడును.

లాభ మమితమౌట, నష్టమువచ్చుట, ఇవి యార్థిక చలనములకుం బ్రేరేపకములు సరి, దీనియర్థమేమి? లాభ మెప్పుడమితమౌను? వస్తురచనకుబట్టు వ్యయమునకు మించిన వెలలున్న నమితలాభము. దీనికి దగ్గిన వెలలున్న నష్టము. కావున నార్థిక తంత్రమను తులకు నట్టనడుమ హెచ్చు తగ్గుల సూచించునదిగా నుండుకీలు, ఉత్పన్న వ్యయము. ఇద్దానితో విక్రయకులు విధించు నవియు క్రయకు లంగీకరించునవియునైన వెలలు ఏకీభవించునేని కష్టనష్టములులేని సమత్వ మలవడును. ఇంతేకాదు. అని యేకీభవింపవేని చలనములు సహజ స్పర్ధచేబుట్టి సంయోగముం గలిగింపజూచును. ఉత్పత్తి వ్యయము రాజు. దాయకులధర పెద్దభార్య. గ్రాహకులధర చిన్నభార్య. ఈ మువ్వురికిని బ్రణయ కలహములు గలిగినప్పు డార్చి తీర్చి ముచ్చటగాగూర్చు విదూషకుడు సహజ స్పర్ధ.

కావున నార్థిక సమత్వము, ఏకాలమందైన సంపూర్ణ సిద్ధికి రాకపోయినను నామార్గముగా క్రయవిక్రయ స్థితులం ద్రిప్పుటకు మాత్సర్యము చోదకము.