పుట:Bhaarata arthashaastramu (1958).pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొరతనమువారు వలదన్న సభలజేయుట యక్రమమనియు రాజశాసనములున్నవి. శాసనములు గావున నివియొకతీరున న్యాయములు. అనగా న్యాయస్థానములో వీనియెడ నందరును విధేయత జూపుట ధర్మముగాకున్నను గర్మము. జడ్జీలు విచారణ చేయునపుడు చట్టమెయ్యదియని యొక యంశము యోచింతురుగాని, ఆ చట్టము మంచిదా, చెడ్డదా యను ప్రసంగముల పొంతకుంబోరు.

ఇట్లనుటచే శాసనములన్నియు దుర్మార్గములని యర్థముగాదు. మొత్తముమీద నివి సన్మార్గములే. అయినను శాసనములు తప్పక సత్పధంబులన పోవలయునను విధివానికిలేదు.

శాసనములు నేడు ప్రచురమునకు రావచ్చును. రేపు మార్పబడ వచ్చును. ఎల్లుండి మాయింప బడవచ్చును. అవి మనుష్యులకు వశ్యములు. ప్రకృతిన్యాయములు నిర్వికారములు. అనశ్వరములు, అతీతములు, అనగా భావాతీతములుగావు. పౌరుషాతీతములు.

ఈచిత్రమేమనవచ్చును! ప్రకృతి న్యాయంబుంగూర్చి యది సన్మార్గమా, దుర్మార్గమా, యని విచారించుట విపరీత మని యంటిమి. ఇట్టి ద్వంద్వములకు మించినదగుటం బట్టియే యది నిర్వికారి. వికారియనగా మార్పులకుం బాత్రమైనది. ఎద్ది మన ప్రయత్నముచే సంస్కరింప బోలునో యద్దానియెడ మంచిచెడ్డల నారోపింతుము. చెడ్డగనున్న మంచిదానిం జేయజూతుము. మంచిగ నున్న నింకను బాగొనరింపం గోరుదుము. కావున వికారములనగా నభివృద్ధికి ననుకూలించునవియని వ్యాఖ్యానముం జేసిన దప్పులేదు: వికారముల కాస్పదములై యుండుట గౌరవ హీనమా? ఏనాటికిం గాదు. నిర్వికారంబులు జడంబులు. దీనికి హిందువులలో నొక ప్రబలమైన యాక్షేపణ గలదు. ఏదన:- వికారియనగా నభివృద్ధి పాత్రము. అభివృద్ధి యనగా గీడును మేలు సేయుట. మేలును మఱింతమేలు సేయుట ఇత్యాది సంస్కార క్రియాకలాపము. నిజముగాని, సంస్కరింప సంస్కరింప బరిపూర్ణత సిద్ధించుంగదా! పరిపూర్ణత వచ్చినపిమ్మట మరల బరిష్కారమునకు నవకాశమెట్లు? వికార మెయ్యడ నిలువ నేర్చును? కావున నిరంజనత నిర్వికారత, జడత్వమును నిర్వికారత్వమనుట పరిహాసమో పరివాదమోకాని యథార్థతత్త్వంబుగాదు. దీనికై పాశ్చాత్యులు ప్రయోగించు ఖండన మేమనగా:- సరికాని, పైవాదములలో నభివృద్ధికి మేరయేర్పఱుపబడియున్నది. మేరలేకుంటయే యభివృద్ధియొక్క ముఖ్య లక్షణములలో నొకటియని మాయభిప్రాయము. అభివృద్ధియ పారము. చూడుడు! ఉష్ణదేశములలోనుండుమీకు "పనిపాటలెపుడు ముగింపునకువచ్చును? ఎప్పుడు తనివిదీర నిద్రపోదుము!" అను నిరీక్షణములు సహజలక్షణములు. కాబట్టియే మీరు అచలబ్రహ్మ మును - అనగా నిద్రాదేవి - నారాధించుట. చలనము మీకు నాయాసకారణము. వికారము కారముగాన మీరు నిర్వికారస్థితింగోరుదురు. ఇక మాదియన్ననో చలిదేశము. మూల గూలబడి యుండుటలో సుఖములేకపోవుట యొకటియేకాదు. కాలుసేతులు ఘనీభవించి కొయ్యవాఱును. శ్రమించకున్న దేహమున రక్తముపాఱదు. కాబట్టి చలనమెంతయో ప్రకృష్టతమమనుట మాకు సహజమైనమతము. అచలముగా బ్రహ్మముగూర్చున్న నయ్యది పేరులేక పేరిపోవునేమో! కావున మేముపాసించు పరిపూర్ణత నిత్యప్రవృద్ధి యతంబు నమేయంబుగాని స్థిమితంబుగాదు. "నిలుకడ నిలుకడ" యనుట మీతపస్సు. దానియొక్కఫలము