పుట:Bhaarata arthashaastramu (1958).pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేల, వక్కీళ్ళేల? రాజులకు రక్షణక్రియ ముఖ్యధర్మమట! ఈ రక్షణక్రియ యనవసరంబగును. వీరికి సమూల సంస్కారులని పేరు.

2. మఱికొందఱు మీదివాదముల నింకను పొడుగుచేసి రాజ్యాంగమునకు కురిత్రాడుగా జేతురు. ఎట్లన, సంఘసామాన్య స్వామ్యముమాత్రము పదిలపడెనేని రాజ్యాంగమువా రనావశ్యకమని యంటిరిగదా! కావున సర్కారును నిర్మూలముజేయుదము. మఱియు బ్రజాపీడకములైన స్థితులన్నియు దొరతనము వారు, మతగురువులు, ఇత్యాద్యధికారులచే వచ్చినవిగాని స్వతస్సిద్ధములుగావు. ఆచార్యులైనవారు తమకు ననువైన యానాచారముల నెల్ల సదాచారములని ప్రజల మోసపుచ్చుట నెవరెఱుంగరు? దొరలునట్లే. కావున నాయకత్వమె తగదు. పశుపక్ష లేలికలులేక స్వభావముగ వర్తించుచు సుఖంబుగ నుంటజూడమా! కావున సంఘమునకు మఱి యెద్దానికిని నధికారమిచ్చుట మన తలమీద మనమే దుమ్ముకొట్టుకొన్నట్టు. అందఱును నిర్ణిద్ర స్వాతంత్ర్యులమై మెలంగుటయ కర్జంబు. ఇట్లు వాదించువారి కరాజకవాదులని పేరు. చూడంబోయిన వీరివాదము వ్యక్తివాదముతో నేకీభవించునది.

3. మఱియు గొందఱు, ఉన్నదానిని సవరించుట నీతిగాని, మేఘముల నీళ్ళనునమ్మి దొన్నెలోని నీళ్ళు పాఱబోయుట నీతిగాదు. మఱియు నిప్పటి యార్థికస్థితియందే కర్తలు కార్మికులు శ్రేణులు గట్టుచున్నారు. ఇట్లే శ్రేణులు ఘనతరములై విస్తరించుచుబోయిన నొకానొకప్పటికి సంఘమెల్ల నేకశ్రేణి యగును. గవర్నమెంటువారనేక వృత్తులను సర్కారుద్యోగముల మాడ్కి దామే నడిపించుటయు నిప్పుడు గలదు. హిందూదేశమున రైల్వేవ్యాపారం, ఉప్పువ్యాపారము సర్కారువారి యధీనమైనవి. ఈ రీతినే యన్నియు నేల కాగూడదు? అట్లైన ప్రజలందఱు నుద్యోగస్థులౌదురు. సంఘముచే రాజ్యాంగముద్వారా ప్రచోదితములైనక్రియల నాచరించి నియమిత వేతనములతో దృప్తిజెంది యేస్పర్ధయు లేక యమందా నందులౌదురు. కావున రాజ్యతంత్ర