పుట:Bhaarata arthashaastramu (1958).pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వకముననైన గొంతవఱకును జదువుసెప్పుట, యజమానులు నిర్హేతుకముగ సేవకుల బనినుండి నివర్తించిన వారిచే నష్టమిప్పించుట, యజమానులకును సేవకులకును జీతము కర్మకాలము మొదలైన విషయములంగూర్చిన భేదములుపుట్టిన సర్కారువారు వానిని విచారించి సమాధానముంజేయ బ్రయత్నించుట, కొన్నికళలలో సర్కారువారే కనీసము కూలినివిధించుట, కర్మశాలలం బరీక్షించి దేహారోగ్యకరములైన యేర్పాటుల స్థాపించుట, స్త్రీలు, బాలప్రాయమువారు, మొదలైన హీనబలులను విశేషించి శ్రమింప జేయకుండునటుల యజమానుల నుక్కడంచుట. ఇవన్నియు రాజ్యకృత్యములైన నియమములు. ఇవిగాక కర్మకరులు తమలోదామే యనుష్ఠించు పద్ధతులుం గలవు. అవి యెవ్వి యనిన, శ్రేణులుగట్టి సమూహముగా బేరములాడుట. యజమానులేల, యుత్పత్తి, వర్తకము, ఇవియన్నియు మనమే చేయుదమని నాయకుల నేర్పఱచుకొని కళలనడుపుట. దీనికి నిరీశ్వర వ్యవహారమనియు సముచ్చయ వ్యవహారమనియు నామములు. రాజ్యమును బాలించు నాలోచనా సభలకు దమకుం జేరినవారినే ప్రతినిధులుగా బంపుట ఇత్యాదులు.

ఈ రెండువిధములైన యుపాయములయు సామాన్య లక్షణంబు లెవ్వియన:-

1. రెండును మాత్సర్య నిరోధిమార్గములు. అనిరుద్ధ స్పర్ధ నవరుద్ధము జేయు నుద్యోగము గలయవి.

2. రెంటియందును నాయకత్వము సంఘమున కారోపింప బడియున్నది. చూడుడు! స్పర్ధనాప వలయునన్న నాయకత్వము ప్రధానం. అందఱును స్వేచ్ఛావర్తనులైన దానిచే సిద్ధించునది మహోత్పాత కారియైన యరాజకము. కావున స్పర్ధయు స్వాతంత్ర్యమును నిరర్గళముగ నేడేశములను నేకాలము నను గలిసియుండుట కూడక పోవుటయకాదు, అసంభవమును. అట్లగుట యోచింపవలసిన విషయ మేమనగా,