పుట:Bhaarata arthashaastramu (1958).pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లు గిరాకి యొక్కయు నుత్పత్తి యొక్కయు స్థితిగతులను మాఱుపాటులను విచారించి గ్రహించి సమయానుగుణముగ వ్యవహారములమార్చుచు నూతనోద్యమములం బ్రారంభించుచు వ్యాపార పారీన భావముందాల్చిన కోవిదులు వ్యవహార నిర్మాత లనబడుదురు. వీరు ఆర్థిక ప్రపంచమునకు బ్రహ్మలు, విశ్వకర్మలువంటివారు. సృష్టిస్థితి వ్యానృతుల కాధారభూతులు. వ్యవహారాండ పోషకులు.

"అవునుగాని, యెట్టి చతురుడైననేమి ? తానై పరిపణము ప్రయోగింపజాలడేని వ్యవహారముల స్థాపించుటెట్లు? బుద్ధికుశలతచే యంత్రముల జాడలెఱుంగనగుగాని యంత్రనిర్మాణ మొనర్చుటెట్లు? మనశ్శక్తియనునది యినుమా, ఉక్కా, కొయ్యా, చీలయా?" యను ప్రశ్నకు సమాధాన మేమన్ననో, ఐరోపాలో ధనరాసులు మితిమీఱి, యుపయోగమున కెవరైన దెచ్చువారు గలరాయని తహతహపడు చున్నవి. ప్రోగుచేసి పాతిపెట్టుటయో నగల జేయించుటయో యాచారముగలేని దేశములలో నీపరిపణ మంతయు బ్యాంకీలలో నుంతురు. బ్యాంకీల యజమానులు నూటికి రెండుమూడు వంతున వడ్డీ యియ్యవలసినవారు గావున, నీధనమెల్ల నూరక భద్రము జేసియుంచిన వారికి నష్టమింతంత యని చెప్పితీఱదు. కావున వారు దీని వినియోగించువారెవరైన నీదారి వత్తురాయని యెదురు చూచు చుందురు. అట్టి సమయములో బుద్ధిబలమున నూతనోద్యమముల గల్పించుటయో యున్నదాని విస్తరింపజేయుటయో యుద్దేశ్యముగా గలవాడు వారియొద్దకుం బోయి తన సంగతులన్నియు సవిస్తరముగ దెల్పి, ప్రారంభము ఫలవంత మగునని వారు నమ్మునట్లుచేసిన, వారు "వీడు శక్తిమంతుడు. యోగ్యుడు" అని నిశ్చయించిరేని బ్యాంకీల యినుపపెట్టెలలో గృశించి కుళ్ళుచుండెడు ధనము నప్పుగా నేలనియ్యరు?