పుట:Bhaarata arthashaastramu (1958).pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మానమున కాలమునకు గలుగు విలువ యింకేవస్తువునకును లేదు. ఐరోపా, అమెరికా ఖండములలో కాలరక్షణార్థమై సృజింపబడి యుండు తంత్రములవర్ణింప నేనెంతటివాడను! చూడుడు! నలుబది యేబది యంతస్తుల మేడలున్నవని వచించితింగదా! మీదికిబోవ గోరిన మెట్లెక్కి దీర్ఘనిశ్వాసముల బుచ్చుచు సేదదీర్చుకొనబని లేదు. విద్యుచ్ఛక్తిచేత క్రిందికి మీదికి రాకపోకలు గలిగిన బండ్లున్నవి. ప్రతి అంతస్తు వద్దను నాబండ్లతో సంబంధము గలిగిన బిసలున్నవి. వీనిందాకిన నాయంత్రము నడుపువానికి నెన్నవ మిద్దెవారు పిలుచు చున్నారని యేర్పడి వాడు బండి నటదెచ్చినిలుపును. పిమ్మట బ్రయాణీకులందు బ్రవేశించి పైనికైన గ్రిందికైన బొమ్మన్న నేయంతస్తునకు బోవగోరుదురో యచటకు జేర్చును. ఈ ఉద్వహన యంత్రంబులు రెండు విధములు. అనతివేగములు అతివేగములని. అనతివేగము లనగా బ్రతి అంతస్తువద్దను నిల్చునవి. అయిదై దంతస్తుల కొకతూరి నిలుచుచు తలదిరుగు నట్లు గవియునవి యతివేగములు. చాల పొడుగుభాగములకుం బోగోరువారు వీనిన యధిష్ఠింతురు. ఈశ్రమములన్నియు గాలరక్షణోద్దేశ్యములని వేఱుగ నెత్తిచూప వలయునా? అమెరికాఖండములోని న్యూయార్కు అను పట్టణరాజములో వీధులం బోవు ట్రాంబండ్లు ముత్తెఱంగు, భూచరములు, ఉపరిచరములు, అధశ్చరములు అని.

1. భూచరములు. ఇవి సాధారణముగ చెన్నపురిలోబలె వీధుల మీద వేయబడిన యినుపకమ్ముల మీద బోవునవి.

2. ఉపరిచరములు. వీధుల ప్రక్కలలో పదునైదిరువది యడుగుల పొడవుగల గొప్ప యినుపకంబముల నాటి, వానిపై వంతెనలరీతి గటాంజనంబుల నేర్పఱచి, యినుపదారుల వేసి వానిపై ట్రాంబండ్ల నడిపించు చున్నారు. గుఱ్ఱపుబండ్లు, మనుష్యులు మొదలగున వేమియు నెదురురావు గావున నవి భూచరముల కైన నెక్కువ వేగవంతములు. వీధుల మీద బోవునవి.