పుట:Bhaarata arthashaastramu (1958).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకానొకడు తనునమ్మినవానినో, చెలికానినో, భాగస్థునినో యేమరించి వానిసొత్తులు గ్రహించి యైశ్వర్యవంతు డేలకాగూడదని యేరైన నడుగవచ్చును. ఇదియొక విధముగ నిజమేయైనను ఈరీతినే యొక దేశములోని జనులందఱు శ్రీమంతులగుదురనుట యసంభవము. ఇందునకొక నిదర్శనము. గ్రామములలో రెడ్లు మొదలగు ప్రబల పురుషులు ఊరివారి హింసించి వారు కష్టించి గడించిన సొత్తుల నన్యాయముగ నాక్రమించుకొని ధనవంతు లైనందుననే గ్రామ మంతయు మంచిస్థితిలో కళగలిగి యున్నదని చెప్పవలనుపడునా ? కాదు. అట్లే గ్రామములో నొకరిద్దఱు రెడ్లు ప్రబలస్థితిలో నుందురో యా యూరనుండు తక్కినకాపులు తినుటకు గడ్డియైనలేని బీదలుగ నుందురనుట మనమెఱిగినదేగదా ? ఈ రీతి నొకరిరువురు గొప్పగా నున్నను మిగత జనసంఘమంతయు హీనదశకు వచ్చుననుట స్పష్టము. మఱియు సంఘము శిధిలమైనచో నేనాటికైన నాగొప్పవారికిని చేటు మూడుట నిశ్చయము. ఇదియును మన కనుభవమునకు వచ్చిన విషయమే. ఊరిలో పులిమాదిరినుండు రెడ్లు కాలక్రమమున బోలీసువారియొద్ద పిల్లులుగను, వకీళ్ళయెదుట కుక్కలుగను, న్యాయాధీశుల సముఖమున నక్కలుగను ఉండుట ప్రసిద్ధాంశమేకదా ?

మన గ్రామము లెట్లో దేశములు నట్లె, రాజులు, పాదుషాలు, నవాబులు మొదలగువారు స్వప్రయోజనపరులై జనుల సుఖ దు:ఖంబుల గణింపక యిచ్ఛవచ్చినట్టు ప్రవర్తించి మితిమీరిన పన్నులు విధించి యన్యాయార్జిత విత్తంబుచే నుత్తమములగు నగరులు సింహాసనములు నగలుచేయించి తామే భూలోక దేవేంద్రులమని విఱ్ఱవీగి నందులకు ఫలము గానకపోయిరా ? ప్రజలకు బలక్షయమగుడు దమకు రాజ్యక్షయమునాయె. దేశమునకు దారిద్ర్యము గలుగుడు దామును బరతంత్రవృత్తుల శరణ మాశ్రయింపవలసినవారైరి.