పుట:Bhaarata arthashaastramu (1958).pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నోరంతదూరమువాగును. వీరికి వీరిమాటయే శాస్త్రము. వాదమే వేదము. కావున నిది పదిమందికి జెందినది చెందనిది యను విచారము లేక సమస్తవిషయములం గూర్చియు గాలక్షేపార్థము సగమును తమ యాడంబరములం బ్రకటించుటకును బొట్టవోసి కొనుటకును సగమునుగా గుజగుజలువోయి యావజ్జీవము జనులకు గజిబిజి సేతురు. మనుజుడు సమూహవాసిగావున న్యాయమునకుంగాకున్న భయమునకైనను విధేయతను జూపుటయో నటించుటయో యాచరించును. "మనజనులది సంఘముగాదు మంద" యని కొందఱు వాదించిరి. మందయొక్క తీరెట్టిది? గొఱ్ఱెలు ప్రక్కనప్రక్కన మేయును. విచ్చలవిడిగ దవ్వుల బోవలయునన్న ధైర్యము చాలదు. నూతన మార్గములన్న బూతములట్లు! ఒండొంటి నొఱయునవియైనను నన్నియు నచ్చుకొట్టినట్లొకేమాదిరి నుండునవి గావున నితరేతర సంబంధములకు నెడములేదు. కావున దేహముల పొత్తేకాని మనసుల కలయిక మృగ్యము. మనసులా? మనకు మన మనసులున్నగదా! మనకున్నవన్నియు పూర్వికుల మనసులే. ఎట్లన మనకు స్వబుద్ధి నుపయోగించి యోచించి తత్త్వనిర్ధారణసేయుట మహాపాపముగదా! పితృపితా మహాప్రపితామహాదు లాదేశించిన విధమ్మున రెండవమాటలేక కన్నెత్తియైనజూడక ఎన్నడో త్రిప్పి పెట్టబడిన గడియారములట్లు పోవుజడులుగాన వీరికిమనసులు లేవనియు వీరిదేహములలో తాతముత్తాతలు పిశాచములై యావేశించియుందురనియు జెప్పిన నతిశయోక్తికాదు. చిల్లరగుంపులలో జేరినవారికి స్వచ్ఛందవృత్తి కలలోనైన గనబడని భాగ్యము. మఱియు పారతంత్ర్య మలవాటగుటచేసి, దేశము వైరుల పాలైనను, స్వాతంత్ర్యముయొక్క సౌందర్యసంపదలను, గాంభీర్య గౌరవముల నెంతవర్ణించినను, హృదయ ప్రతిబింబితములు గాజాలనంత పందలు గావున, నిట్టివారికి విషాదరోషమ్ములును గలుగవు. అభిమన్యులై దేశసేవా విజృంభణ నియుక్తులు గావలయునన్న, చిల్లర