పుట:Bhaarata arthashaastramu (1958).pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలయు సామగ్రుల నిచ్చునిధియైయుండును. సంఘము వారందఱు నన్యోన్యసహాయులైనమేలా? ప్రత్యేకముగ నాతురతమై యొకరికి సాయముజేయక తానొకరివలనగోరక తనకు గావలసినవన్నియు దానే బడయజూచుటమేలా? తలపోసిచూడుడు. అన్నిటిని జేయజూచిన నేదియు సరిగా గుదురదనుట పరమరహస్యమా? మన మాతురతగొని యొకరినినమ్మక పరులపొత్తునాశింపక యన్నింటిని జేయజూతుము. ఫలమో! పండిపండని పాడుఫలమే! రాకపోకలను వాణిజ్యమును విచ్చలవిడిగబెంచి యొండొరులకు సహాయభూతులై యూరోపియనులు సర్వభోగ సమృద్ధతామహిమచే శోభిల్లెదరు. ఇది విస్మయావహంబుగాదు.

హిందువులలో గ్రామ్యపద్ధతి ప్రముఖంబుగ నుంటకింకను హేతువులెవ్వియనిన?

గృహములను ఫ్యాక్టొరీలుగా జేసియుంచినయెడల కష్టములో బహుళభాగము స్త్రీలనెత్తిమీదబడును. కానధీరోదారభావములేని తుచ్ఛులగు పురుషులకిది యనుకూలించిన యేర్పాటు. మనదేశమున నబల లనబడువారు మగవారికన్న నెన్నియోమడుంగులు ఎక్కువగ పాటువడుటంజూచి పాశ్చాత్యులు మనల నతినీచమానవులని పరిహసించెదరు. బావులు త్రవ్వుట, ఇండ్లుకట్టుట, రోడ్లువేయుట ఇత్యాది యత్నములలో నీళ్ళు రాళ్ళుమోయుట, సున్నమునూరుట, ఇట్టి దుర్భరకార్యము లనేకములు స్త్రీలకేచేరిన వరప్రసాదములు. ఇంగ్లాండులో భారవహనభాగ్యము స్త్రీలకిప్పు డేమాత్రమునులేదు. మోటు వారికిని నాగరకులకును నిదియొక ప్రబలమైన యంతరము. ఎట్లనిన:- ఆఫ్రికాఖండములో మొలగుడ్డదప్ప నింకేమియులేక యడవిమనుష్యుల బోలి సంచరించు కాఫరులను తెగవారిలో పురుషులు బహుభార్యో పేతులైయుండుట సర్వసహజము. ఈ కృష్ణలీలకు కారణము కామము గాదు. మఱికర్మమా? కర్మమునుగాదు. కర్మవిమోచనము! అనగా,