పుట:Bhaarata arthashaastramu (1958).pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలవ్రయభీతిలేని యీ దేశమున మాత్రమే చెల్లును. ఇంగ్లాండులో నరరూపాయ సెలవైనను అరగంట మిగిలిన నితర యత్నములం బూరింపవచ్చునను త్వరయున్నది. అల్పోద్యోగములు గలదౌట ఇండియాలో కాలయాపనచింత మందునకైన దొరకదు. వేగిరపాటు వారికెట్లో యట్లే మందయానము మనకు సొంపుగాకున్నను ఇంపైన పద్ధతి.

హిందువులు మృదుహృదయములు గలవారగుట ప్రత్యక్షముగ సాపాటుచేయించుటలో దఱుచు కాఠిన్యముం జూపరు. రూకలులేని దేశముగాన రొక్కజీతముల యేర్పాటులో నెక్కువ కఱుకుగా నుండెదరు గ్రామములలో సేద్యగాండ్రకు భూస్వాములే మధ్యాహ్న భోజనంబిడుట సర్వసాధారణము. కొందఱు ఇది యన్నదానబుద్ధిచే గుదిరిన యభ్యాసమని పొరపడెదరు. అన్నదానబుద్ధి యున్నది గాని దానికనర్గళ సహాయకారియు నొండుగలదు. అదేదన స్వప్రయోజన పరత. ఎట్లన మాదిక్కు కలుపుదీయుట, కోత, కళ్ళము ఈ పనులకు కూలి మధ్యాహ్నపు గడితో 1 1/2 అణా. కడిలేక 2 అణాలు. ఇక పెట్టబడు విందుసంగతి. ఒకముద్ద లేక ఒకటిన్నరముద్ద అరచేతిలో నుంచుకొని యారగింతురుగాని ఆకులసెలవులేదు. ఈ నైవేద్యము ఒకరొకరికి 1/2 అణాకువచ్చిన దానకర్ణత్వ మనవచ్చును! మఱియు రొక్కము జీతమునకన్న గొంత మెక్కువకు వచ్చినను కూలివారు తప్పక తినెదరుగాన పనియు నెక్కువయై, క్రియాపూర్తికి వలయుకాలము తక్కువజేయుటవలన చిట్టచివరకు యజమానులకు లాభ మాపాదించును. అట్లుగాక రెండణాలు వారిచేతిలోనిడిన, పాపము, నిరుపేదలు గావున, పస్తుపడియైన గూడబెట్టుదమని వారొకపూట జలాహారముతో విరమించిరేని పని తక్కువయగును. రెండునాళ్ళలో ముగియుపని మూడునాళ్ళవును. కూలియు నెక్కువకు వచ్చును.