పుట:Bhaarata arthashaastramu (1958).pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునుజూచి "ఓ చెట్టా! నీవు మనుధర్మ శాస్త్రప్రకారము నడచుకో. నవనాగరికులమాట పెడచెవిని బెట్టుము" అని యెవడైన మందలించునా? సంస్కరణశక్తి మనకుంటంగాదె అవ్వలు , అయ్యలును అన్నిధర్మముల నుపదేశించుట మనమువిని యట్లాచరింపం దొడంగుట?

కర్మముయొక్క తత్త్వంబేమన:- చేష్టలతో స్వభావము మాఱుననిగాని నిరోధింపంబడునదికాదు. దృష్టాంతము. దేహపరిశ్రమం జేయువారు వ్యాయామములందు సక్తచిత్తులై యుందురు. సోమరి పోతులయినవారికి క్రీడార్థము పరువులు వాఱుదమన్న గాళ్ళురావు. మనసు నామోదింపదు. అయినను పట్టుబట్టి కొన్నినాళ్ళు నొప్పికోర్చి శ్రమించిన నట్టిపాటులు భరములుగ దోపవు. మఱియు మున్ముందుగ నుత్సాహము సుఖము నిచ్చును. అటుపిమ్మట ఏనాడైన లీలావిహారములం జేయకున్ననాడు శరీరమానసంబు లుత్సాహహీనంబులై వాడుబాఱును. కావున గర్మలచే స్వభావమును స్వభావముచే గర్మలును యుక్తపథంబుల నడుపవచ్చుననుట తథ్యము. పౌరుషంబు సహజ గుణంబులలోనెల్ల నాయకత్వంబుదాల్చిన ధర్మంబు. కర్మములు వాడుకయట్లేగాని యంతకన్న మిన్నలుగావు. వానిందలంచి భీతిం గలంగుట తననీడజూచి తాభయముగొన్నట్లు.

మనకార్యములు మనలనేగాక సంఘముంగూడ జెందుననుట న్యాయము

కర్మమెట్లున్ననేమి? అది యెవరి నావేశించుననుట యింకను ముఖ్యమైన యంశము. పామరజనమత మేమనగా:- "నే జేసిన కర్మము నన్నేపట్టును. దానిచేత నాకు నింకొకజన్మమున గొప్ప పదవియో చిల్లరయుద్యోగమో ప్రాప్తించును.

       క. "ఈ యొడలువిడిచి వేఱొక
           కాయముగైకొని శరీరి కర్మవాసగతిం
           బోయి సుఖదు:ఖముల గను
           నాయక వెండియును దేహబంధము బొందున్."