పుట:Bhaarata arthashaastramu (1958).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొణుగుట, కార్యవేళల గన్నులు మూతవేయుట ఇత్యాది చేష్టలు లేనివియును అధిక ఫలప్రదములు నుగానున్నవి. దీనిచే నెల్లప్పుడు గాకున్నను గొన్ని సందర్భములయందు పనివాండ్రకు నష్టమువచ్చు ననుట మందలించితిమి. కావున తాత్కాలికమైన శత్రుత్వము గలుగుటయుం గలదు.

మనదేశములో యంత్రపు వస్త్రములు ప్రసరించుటంజేసి సాలెవారి కాదాయము క్షీణతకు వచ్చుటయు నీశత్రుత్వమునకు నొక తార్కణము. అయినను యంత్రములు మితిమీఱిప్రబలిన దేశములం గాని యీహాని రాష్ట్రమునకు బాధాకరముగాదు. అట్టిదేశములసైతము సరాసరికి దీర్ఘకాల ఫలముల గణించిచూచిన శుభమేకాని యశుభమని ఖండితముగా జెప్పుటకు వీలులేదు. కావున నేదియెట్లున్నను హిందూదేశములో యంత్రములు పొంగి పొరలి మనలనెల్ల గొట్టుకొనిపోయి సముద్రములో జేర్చునను భయము ఇక గొన్నిశతాబ్దములవఱకును మనము పడవలసినదిలేదు. అప్పుడైన భయముపడవలసిన ప్రమేయముండునా యని శంకించెదను.

యంత్రీయముల వెల న్యూనతవహించు జాడగలవియనియంటిమి. ఈవిషయమై కొంద ఱిట్లు సందేహింపవచ్చును. యంత్రములలో వేయబడు అపక్వవస్తువులు (బొగ్గు, దూది, ఇనుము ఇత్యాదులు) హీనవృద్ధికి జేరినవి. ఇవియు విస్తరించినంగాని యంత్రోత్పత్తి విస్తరించుట యసంభావ్యము. వస్త్రము లాధిక్యముజెందుట ప్రత్తి ఎక్కువ పండినంగాని కాదు. ప్రత్తి ఎక్కువగ బండించవలయునన్న భూములకు సారమెక్కువగ వేయవలయు. లేదా అల్పసారమైన భూములలో ప్రత్తినాటవలయు. ఎట్లుచేసినను కృషికులకు సెలవు హెచ్చుటంజేసి ఎక్కువ క్రయములేనిది వారికి గిట్టిరాదు. కావున ప్రత్తియొక్కధర పెరుగుననుట ప్రతీతము. ప్రత్తివెల పొడుగైన మల్లులు వెల కుఱుచౌట యెట్లు?