పుట:Bhaarata arthashaastramu (1958).pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కన్న నెక్కువ చాలిరాదని శాస్త్రజ్ఞులు మితముగ బలికిరే? బొగ్గు నుగ్గైన మనగతి యప్పటికి "యధాస్థానం ప్రతిష్ఠాపయామి" యేనా?

అని యడిగిన సమాధానము, బొగ్గులేకున్నను విద్యుచ్ఛక్తి గమనకారిగ నుండలేదా? ఒక్క కావేరినదినుండి శివసముద్రము, కన్నంబాడి యనుచోట్ల నీరు ఆకాశగంగగా బడుటచే తత్పతన వేగం వలన నెంతో విద్యుచ్ఛక్తి యావిర్భవింపంజేసి గవర్నమెంటువారు కోలారులోని గనులకును బెంగుళూరు మైసూరు పట్టణవాసులకును యధేష్టముగ శక్తినొసగుచున్నారనుట తెలిసియేవున్నది. పృథివిలో నుండు నదులనంతయు కనుమలలో కట్టలుగట్టియాపి, 30 లేక 35 అడుగులుపొంగి దుముకునట్టు చేయుటచేతను, హిమవంతము, ఆల్పుసు, ఆండీసు ఇత్యాది గగనచుంబగంభీరగిరులనుండి పాఱునదులలోను సాంద్రనీహార ప్రవాహములలోను నడగియున్న శక్తిని వెలికిదీయుట చేతను చలనక్రియ యంత్రాధీనముగ జేయవచ్చును. ఈనదులు సమసి పోవువఱకును నిద్రపోముగదా! నూతన ప్రయోజకముల గనుగొన కుందుమా? ఇపుడే అక్షయద్రవ్యమనందగు 'రేడియ' మను లోహమును వాడుకలోనికి దీసికొనిరాలేదా? అని శాస్త్రజ్ఞులు పల్కుదురు.

మఱియు నమెరికాలో 1902 సంవత్సరములో 40,000 రైల్వేఇంజన్‌లు పనిలో నుండినవి. వీనిచేనగు కార్యము యంత్రరహిత తంత్రములచే జేయంబూనిన 7,60,00,000 గుఱ్ఱములు. 1,90,00,000 మనుష్యులును గావలసివచ్చును. అయినను రైల్వేలలో తోలువారు, స్టేషన్‌మాష్టర్లు సహా సిబ్బందియంతయు 10,00,000 మందే. కావున 1,80,00,000 మంది శక్తి యితరోద్యోగములకై యంత్రయుక్తిచే మిగిలింపబడిన దనుట యెంతచోద్యమో యోచింపుడు! ఒక్కమిషన్ ఉండిన నూఱుగురు పనివారుండినట్టు. అందఱికిని యంత్రములు దొరకిన హాయిగా దొరలవోలె పనిజేయించుకొని తమయిల్లే యింద్రలోకముగా నుండ వచ్చునుగదా!