పుట:Bhaarata arthashaastramu (1958).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలానుగుణమైన నాగరికత విజృంభించుతఱికి కాలప్రతికూలంబులగు చందంబులు మందతనొంది సమకాలికంబులయ్యు జీవచ్ఛవంబులపగిది గుళ్ళుచు తుదకు నామమాత్రావశిష్టంబు లగుననుట. కాలమ్మున సంయుక్తతయున్నను దేశమ్మున సంయుక్తతయుండదు. అనగా నూతనోద్యోగులు పైబడివచ్చిన మనము వారికితావిచ్చి వెనుక కొదుగ వలసినవార మగుదుము. వారుప్రవేశించినచోటు నాగరికహీనులు కాలిడుటకుగాదు వీరుండ వారురావచ్చును పోవచ్చును. వీరిని వెడలనైన గొట్టవచ్చును. బలములేదు కాన ప్రతిక్రియ జేయంజూచుట యలవికాని యుద్యమము. కాబట్టి కాలంబొండైనను విధివేఱయ్యెడిని. కాలానుగుణాచారప్రచారమే యిందులకు మందు.

ఒకయుగంబున దత్పూర్వయుగంబుల లాంఛనంబులెవ్వియు లేకపోవుననియి దలంపగూడదు. మనదేశమున కృషీవలులును గొల్లవాండ్రును మందలనుంచుకొనుమాదిరి ఐరోపాలోను వ్యవసాయ గోపాలనములు నిక్కడికంటె సమృద్ధిగ జరుగుచున్నవి. అయినను వానికీదేశముననుండు ముఖ్యత యక్కడలేదు. హిందూదేశములో సుమారు 195,668,362 మంది కృషియేగతియనియున్నారు. పశ్చిమ ఖండనివాసులకు వ్యాపారవాణిజ్యాదులేజీవనదులు. కృషియునదితో సమానము. కరటింబోలె తదనంతరయుగా విర్భావసమయంబున మాతృయుగంబు మృత్యుగోచరమై మటుమాయమౌనని ఎంచరాదు. మఱేమన వర్తమానము భూతంబునంబట్టి భవిష్యత్తులోనికి బ్రవహించును. త్రికాలములును సముచ్చితములు. వర్తమానంబు భూతంబునకు ఫలంబును భవిష్యత్తునకు బీజంబునైయుండు. ఇయ్యది వృద్ధిలక్షణంబు. పెఱుగుటలేకున్న విఱుగుట సిద్ధంబు. అచలత్వము జడ ధర్మంబు. చైతన్యధర్మంబు చలనంబు. కావున నెయ్యది నేడు సిద్ధిగ నెన్నబడునో యది వృద్ధిదినములనాటి కుపకరణమౌను. కారణజాతం బైనకార్యంబు తదితర కార్యంబులకు కారణంబౌటయే పరిణామంబు.