పుట:Bhaarata arthashaastramu (1958).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సముద్రములు

శాఖోపశాఖలుగ భూమిలో బ్రవేశించి వంకర టొంకరగా నుండు తీరములుగల సముద్రములు ఓడయాత్రలకును మత్స్యగ్రహణమునకు ననుకూలములైనవి. వైశాల్యమును విచారించి చూచిన ఇండియాకన్న ఇంగ్లాండు చిన్నదియయ్యు నెక్కువతీర వైశాల్యమును మంచిరేవులునుగలిగి వాణిజ్యార్థమే సృష్టింపబడినట్లు పొందిక గలిగియున్నది. ఇట బొంబాయితప్ప మఱెచ్చోటను బ్రశస్తములైన నౌకాశ్రయములం గానము. మదరాసునొద్ద లక్షలుకొలది సెలవుజేసి యొక చిన్నరేవును గట్టించియున్నారు. కాకినాడలో ఓడలు కూలమునకు మూడునాల్గుమైళ్ళ సమీపమునకైన రాజాలవు. ఇక మంగళూరన్ననో యంతకన్న నికృష్టము. కావుననే కాబోలు మనవారుసముద్రయానమున గౌశలమును కుతూహలమును జెందరైరి. ఇందునకుదోడు నౌకాయాత్రకూడదన్న దబ్బరశాస్త్రములునుజేరి మనల సాహసహీనుల జేసినవి. ఎగుమతి వర్తకములేనిది ధనము దేశమునకు రాదు. ధనములేనిది వృద్ధి పౌరుషములు నశించును. కావున నెగుమతికి ముఖ్యోపకరణమగు సముద్రయానం బవశ్యకర్తవ్యంబు.

క్షేత్రముల విచారణ సంపూర్ణముగ గావలయునన్న కృషి శాస్త్రంబు జదువవలయును. ఇచ్చట గొన్ని యంశములుమాత్రము వివరింపబడును.

అధిక సమ హీనవృద్ధి న్యాయములు

అపూర్వముగ సాగుబడి క్రిందికి దేబడిన పొలములు మిక్కిలి పోతరించి ఫల మమేయముగ నొసగును. అట్టి నేలలో నొకింత ఎరువు వేసిన రెండింతలకన్న నెక్కువ ఫలము బండును. రెండింతలువేసిన నాల్గుమడుగులకన్న నధికముగ సస్యాభివృద్ధి యగును. దీనికి "అధికవృద్ధిన్యాయంబు" అని పేరు.