పుట:Bhaarata arthashaastramu (1958).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురాణేతిహాసములు ఘోషించు చున్నవి. తాత్కాలిక ప్రయోజనార్థులును వివేకశూన్యులు నగువారిచే నట్టికాఱడవు లన్నియుగొట్టబడి నాశంబునొందె. ఇప్పుడు ఆసాము మైసూరు తిరువాన్కూరు మొదలగు కొన్నిదేశములలో మాత్రము కాననములు కాననయ్యెడిని. ఇట్లు మహారణ్యము లన్నియు నడుగంటుటచేతనే యీదేశము క్షామపాత్రంబయ్యె ననుట నిర్వివాదాంశము. రామరాజ్యము నాటికిని నేటికిని భేదమేమనగా అప్పుడు మేఘముల నాకర్షించునట్టి యరణ్యములచే నలంకృతములగు కొండ లుండినవి. ఇప్పుడన్ననో కొండలున్నవి కాని చెట్లు లేకపోవుటచే నవి మబ్బును చల్లార్చుశక్తి లేకపోవుటయే కాదు, ఎండను ఇంకను మిక్కిలి మనపై వ్యాపింప జేయునవియై యున్నవి. కావుననే ఆ కాలమున నెలకు మూడువానలును ఈ కాలమున మూడేడులకొక వానయుగా నుండుట. కలియుగమునకును ద్రేతాయుగమునకును నిజమైన వ్యత్యాసము అరణ్య సముదాయమేకాని ధర్మదేవతా పాదములు గావు. ఐరోపాలో స్పెయిన్ అనుదేశము మునుపు బహుసారవంతమును ఫలవంతమునై యుండెను. కాని వనరాజి రాను రాను క్షయంబునొందెగాన ప్రకృత మనావృష్టిపాలై యిడుముల కెడమై యున్నది.

జలాధారములు లేనిది ప్రశస్తభూమియును మరుభూమి యవును. వర్షములు కురియుటకును కురిసిన జలంబు వ్యర్థముగ నొకే దాటున బోకయుండుటకును అడవులు సాధనములైనవి. ఇంగ్లీషు వారీవిషయములను చక్కగ శోధించి తెలిసికొన్న వారౌట నీదేశములో మిగిలియుండు నడవులను రక్షించుటకును లేనిచోట బునరుత్పత్తి జేయుటకునై శాసనముల నేర్పఱిచి యున్నారు. ఇది యెంతయు గౌరవింప దగిన క్రమంబని దృడంబుగ జెప్పవచ్చును.

అడవుల గొట్టివేయుట కొన్నినాళ్ళపని. పునర్జీవితం బొనర్చుట తరములకైనంగాదు. ఎంతోశ్రమకును కష్టమునకు నోర్చి యపుడు నష్టమైనను భావిని మేలగునవి యెంచి యభినివేశముతో నుద్ధరించినం