పుట:Bhaarata arthashaastramu (1958).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రకృతిశాస్త్రపరిశీలనమ్మున వాని నుపయోగమునకు దెచ్చు తెఱంగు లెఱింగి కష్టనష్టము లెన్నికలిగినను ఉత్సావాహీనులుగాక, యుద్యోగము నెఱవేరినంగాని యుద్యమము సమాప్తి నొందింప మను స్థిరచిత్తము గలవార లున్నంగాని దేశమున కభ్యుదయము ప్రాప్తింపదు.

నైసర్గికస్వభావములు ప్రతివానికిని ఆస్తిగాకపోయినను దేశాభివృద్ధికి గారణములై తద్ధ్వారా మనకును మేలుదెచ్చును. ఎట్లనిన గోదావరీనది నీదికాదు. నాదియుగాదు. ఐనను తత్ప్రవాహమున ఫలవంతములైన లంకలు నేలలు ఉండబట్టి యచటి వారు ధనికులుగ నున్నారు. ఇందుచే వ్యవహారములు వ్యాపించి బీదసాదలకు జీవనోపాయము గల్పించునవిగానున్నవి.

దేశములలో దారతమ్యనిరూపణ జేయబూనితిమేని నైసర్గిక స్వభావములను లెక్కకు దేవలయును. ఏకదేశస్థులలో నెక్కువ తక్కువల జర్చించుచో నివి యెల్లరకును సామాన్యములే యగుట నట్లుచేయుట తగదు.

ప్రకృతులు పారాపారములని రెండువిధములు

మేరగలవి మేరలేనివి యని ప్రకృతులు రెండువిధములు. అందు గాలి మేరలేనిది. ప్రతివానికిని కోరినంత దొరకును. గాన దానికి మూల్యము సాధారణముగలేదు.

ప్రకృతులలో అనంతములు గానివి యెక్కువ ముఖ్యములు. మితరాశియుక్తములుగాన ఒకరికెక్కువయైన దదితరులకు దక్కువ యగుట సంభవించును. అంత్యప్రయోజనమును మూల్యమును అధికముగ గలవి గాన నివి సర్వజనాదరణీయములై పోటాపోటిని బుట్టించునవిగా నున్నవి. భూమియు నాకాశమువలె నక్షయముగా ననంతముగా నుండిన ఒకరిభూమి నొక రాక్రమించుకొనుటయు 'ఇదినాది అదినాది' యని స్వామ్యమును స్థాపించుటయు, రాజులు ఒకరితోనొకరు యుద్ధము జేయుటయు సంభవింపవు. మితత్వమే స్పర్థాదుల కుత్పత్తి స్థానము.