పుట:Bhaarata arthashaastramu (1958).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆర్థికన్యాయంబుల ప్రచురపఱుచుచు నీయర్థశాస్త్రంబును గృతకృత్యమే. మీరందఱును గుబేరలోకమునకు బోవ సోపానము లేర్పఱుచుట దీని యుద్యమముగాదు.

2. శాస్త్రన్యాయములు నేరుగ ఫలవ్రసాదకములు గాకపోయినను, వ్యాపారదక్షు లయ్యవి యెఱింగి యుచితగతి నుపయోగమునకుం దెచ్చువారైరేని వారి కఖండలాభావహంబు లగును. కన్నుమూసికొని పోవువారికన్న దెఱచికొని పోవువారు శ్రేష్ఠులనుట పరమ రహస్యమా?

3. వ్యవహారము లియ్యైతెఱంగుల బోవుననుట ఖండితముగ జెప్పజాలము. అయినను శాస్త్రజ్ఞానముచే నవిపోవు జాడలను సూచనగా దెలిసికోజాలుదుము. ఇది యల్పమైన సిద్ధిగాదు.

మఱియు సంఘములయొక్క ధర్మములు సంగములు మొదలైనవానిని నిర్మించి పరిణమింపజేసిన హేతువులలో నార్థికస్థితిగతులు ప్రథమగణ్యములుగావున నీశాస్త్రము పఠించుటచే సంఘోత్కృష్టతా సమయములు గొంతకు గొంతయైన గోచరము లగును. ఇయ్యది సంఘశాస్త్రంబు గాదుకాని దానితో బరమ మైత్రింజెంది యభేద్య సంయోగము గలది. మనుష్యసంఘములను బరిశీలించుటకన్న మేలైన విద్య లెవ్వియును లేవు.