పుట:Baarishhtaru paarvatiisham.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుని ఒకచేత్తోటి కత్తి పుచ్చుకుని చివర పండ్లున్న చెంచా (Fork) రెండోచేత్తో గుప్పిట్లో గట్టిగా పట్టుకుని గునపము భూమిలోకి దింపినట్లు ఎత్తి రొట్టెమీద గుచ్చబోయాను. అలా కాదు, జాగ్రత్త, కంచము బద్ధలవుతుందని నాస్నేహితుడు నిమ్మళంగా చెపుతూనే వున్నాడు. ఆ మాట నేను వినుపించుకొలేదు. ఇంతటిలోకే వచ్చే ప్రమాదమేమిటి, ఈ మాత్రము చేతకాకుండా వుంటుంది గనకనా, ఇదొక పెద్ద బ్రహ్మ విద్యా ఏమిటని రొట్టెమీదికి నా శక్తికొద్ది గభీమని దింపాను. కూర్చున్నవాళ్ళంతా ఊపిరి బిగబట్టుకుని ఏమిజరుగుతుందా అని చూస్తున్నారు. దింపేసరికి తలనొప్పిగా వుండడము చేతనో ఏమో కాని గురితప్పి రొట్టె చివరతగిలి దానిమీదనుంచి జారిపోయి కంచమంచుకు తగిలి దానిమీదనుంచికూడా జారిపోయి బల్లకు గుచ్చుకుంది. ఆ అదురుకి రొట్టెముక్క జానెడెత్తున ఎగిరి బలికి తీసుకువెళ్ళిన మేకపిల్ల వీలయితే తప్పించుకు పారిపోయినట్లు నాపక్కనున్న నాలుగు కంచాలమీదనుంచీ దాటి అయిదో కంచం పక్కన దాక్కున్నది. నాకంచముకూడా నా బోటి వాళ్ళ ననేకమందిని చూసివుండాలె. అయినా కంగారు పడి వచ్చి నావొళ్ళో పడ్డది. ఇంతవరకూ ప్రమాదమేమీ కలగలేదని సంతోషించాను. కంచము కిందపడితే రెండు చెక్కలయ్యేది. దాని ఖరీదు, ఏ అణో, బేడో అయినా వాళ్ళు వచ్చి రెండు రూపాయలో మూడురూపాయలో తెమ్మంటే చచ్చినట్లు ఇచ్చుకోవలసిందే గదా అలాంటి దేమీ లేకుండా తప్పిపోయింది. ఇవ్వాళ లేచిన వేళ మంచిదే ననుకున్నాను.

నా పక్కనున్న వాళ్ళంతా నవ్వడము మొదలు పెట్టారు. ఎందుకు వస్తుంది నవ్వు అలా అస్తమానమూ అయిన దానికీ కాని