పుట:Andhrula Charitramu Part 2.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యింటికి మరలిపోయి సుఖనిద్రజెందెను. నిద్రలోనామెకు నందీశ్వరుడు ప్రత్యక్షమై నీ గర్భమున వసించియున్న పుత్రుడు నాయవతారమేయనియు, వీరశైవమత స్థాపనకై పంపబడినవాడనియు, నతనికి బసవ (వృషభశబ్ద భవము బసవ) నామము పెట్టవలసినదనియు చెప్పి యదృశ్యుడయ్యెనట. పిమ్మటనామె పుత్త్రుని బ్రసవించినతోడనే యతడు లింగధారియై కన్పడెనట. ఏలయనగా, గర్భమునందే శివుడతనికి శైవమతముపదేశించుట చేత నీరీతిగా జనించెను. తరువాత బసవేశ్వరుడెనిమిదేండ్ల ప్రాయములోపలనే సమస్త విద్యలను నేర్చి మతజ్ఞానమును సంపూర్ణముగా బడసెను. ఎనిమిదవయేట నతని తల్లిదండ్రులు తమ బంధువులందరను బిలువంబంచి యతని కుపనయనము చేయ బ్రయత్నింపగా నాతడు తండ్రినిజూచి "నాయనా! నేను శివపూజా దురంధరుడను; బ్రహ్మవంశమునకు సంబంధించినవాడను గాను; నేను వర్ణవృక్షచ్చేదనమునకు కుఠారమువంటివాడను నాకు వర్ణబేధముతో నిమిత్తము లేదు"అని నిశ్శంకగా బలికెను. అంత ఉపనయన మహోత్సవమునకు విచ్చేసిన యాతని మేనమాయు బిజ్జలుని మంత్రియునగు బలదేవయ్య మేనల్లుని వర్తనమున కద్భుతపడి మెచ్చుకొని తరువాత తన కొమార్తెను గంగాదేవినిచ్చి వివాహము చేసెను.

వీరశైవసిద్ధాంతములు.

రామానుజునివలెనే బ్రాహ్మణమతమును నిరాకరించి నూతన మత సిద్ధాంతమును బోధించుటచేత బ్రాహ్మణులు బసవేశ్వరుని వేధింపమొదలుపెట్టగా, నతడు స్వగ్రామము విడిచి మరియొక స్థలమునకు బోవలసివచ్చెను. ఒకనాడు బసవేశ్వరుడు సంగమేశ్వరాలయమునకు బోయి పూజ చేయుచున్న కాలమున, శివుడు ప్రత్యక్షమై అద్భుతములును ఆగమ్యములునైన సిద్ధాంతములను బోధించి యిట్లనియెను. "నీకు మాయెడగల భక్తిని దెలిసికొంటిమి; శివవేషధారులయిన జంగములను శివునియవతారములని గ్రహించి సత్యమైన మతము సమష్ఠింపుము; నీవు చేయునట్టి కర్మములయందు వారిననుసరింపుము;