పుట:Andhrula Charitramu Part 2.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నందలూరు శాసనములో నొకదానియందు మనుమసిద్ధి కోడూరుగ్రామమును 1257వ సంవత్సరమున బ్రాహ్మణులకు దానముచేసినట్లుగ వ్రాయబడినట్లు చెప్పియున్నాను. ఆ శాసనములోనే మనుమసిద్ధి రాజు కాకతీయ గణపతిదేవునితో స్నేహము సంపాదింపవలయునని కోరిక గలిగియున్నట్టుగ దెలుపబడియున్నది. కాబట్టి 1257 వరకును మనుమసిద్ధికి గణపతిచక్రవర్తితో మైత్రిలేనటుల స్పష్టమగుచున్నది. మరియు అతడా సంవత్సరముననే గణపతిదేవుని సామంతుడైన మహారాష్ట్రసారంగునితో యుద్ధముచేసి జయించుటకూడ పై యంశమును బలపరచుచున్నది. కనుక 1257వ సంవత్సరమునకు తరువాతనే వారిరువురకు మైత్రియేర్పడియుండవలయును. క్రీ.శ.1260వ సంవత్సరమున రుద్రమదేవి కాకతీయసింహాసనమధిష్టించినటుల త్రిపురాంతకములోని ఒక శాసనమున చెప్పబడియున్నందున, గణపతిదేవుడు 1260వ సంవత్సరముననే కీర్తిశేషుడై యుండుననుటకు సందియములేదు. కనుక సిద్ధేశ్వరచరిత్రము నందు జెప్పినట్లు అక్కనబయ్యనలు సిద్ధిరాజును బారద్రోలి రాజ్యమాక్రమించుకొనుట 1257, 1259 సంవత్సరములలో జరుగవలసియుండునుగదా. ఆ సంవత్సరములో మనుమసిద్ధిరాజు రాజ్యాభివృద్ధికై సిద్ధిరాజుచేతను, అతనికి సామంతలుగనున్న పల్లవరాజుచేతను, కందుకూరు సీమలోని వెంట్రాలలో జేయబడిన దానశాసనములు గనంబడుటచేత నా కాలమునందు సిద్ధిరాజు రాజ్యపదభ్రష్టుడయ్యెనని విశ్వసింపరాదు. కాబట్టి సిద్ధేశ్వరచరిత్రమునందలి అక్కనబయ్యనల చరిత్రము కల్పితమని చెప్పవలసివచ్చుచున్నది. తిక్కనసోమాయజి నిర్వచనోత్తర రామాయణము రచించునప్పటికీ మహాభారతమును తెనిగించియుండలేదని యా గ్రంథములలోని గద్యములనుబట్టియే మనము సులభముగా గ్రహింపవచ్చును. నిర్వచనోత్తరరామాయణము 1257వ సంవత్సరమున రచింపబడియుండవచ్చును. అట్లయినయెడల నా సంవత్సరముగాని, మరుసరి సంవత్సరముగాని, సిద్ధిరాజు రాజ్యపదభ్రష్టుడైయున్న కాలమున తిక్కనమంత్రి యజ్ఞమునుజేసి, తెనుగు భారతమును రచించి గణ