పుట:Andhrula Charitramu Part-1.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రుల కృష్ణా గోదావరులనడుమనుండెడి యరణ్య ప్రదేశమున తూర్పుభాగమున ననగా నిప్పటి కృష్ణామండలమున నివసించుచుండెడి వారని చరిత్రకారులనేకు లభిప్రాయపడియున్నారు. కృష్ణా గోదావరుల నడుమనుండెడు నరణ్యప్రదేశమే యాకాలమునం దాంధ్రదేశముగా నుండెను. రామాయణ మహాభారతముల నాటికి దక్షిణాప్రదేశమున నాంధ్రదేశము లేదనియు ఇప్పటి యాంధ్రదేశము బహు నవీనమైనదనియు, ఆంధ్రులు మగధదేశ సమీపమున గంగాతీరమునందుండి నాగరీకులై క్రమక్రమముగా దక్షిణమునకు వచ్చి యీదేశమును జయించి యాక్రమించుకొనిరనియు, అప్పటి నుండి నీదేశమునకాంధ్రదేశమని పేరు వచ్చినదనియు కొందరు పాశ్చాత్యులు మాత్రమే గాక మనవారు కూడా కొందరు తలంచుచుండిరి. మరియును శ్రీరామాయణమునందీ ప్రదేశము దండకారణ్యముగా జెప్పబడుటచేతను శ్రీరాముని మార్గమునం దీదేశము బేర్కొనబడ కుండుటచేతను, రామాయణములోని కిష్కింధా కాండములో నాంధ్రాది దేశముల ప్రశంస దేశములదెల్పుచోట గలిగియున్న నది ప్రక్షిప్తముగా గ్రహింపవలసి యున్నదనియు ఇక మహాభారతమును బట్టి చూచినను నీ ప్రదేశము మరణ్యమనియె తోచుచున్నదనియు, అర్జునుడు తీర్ధయాత్రకు బయలుదేరి మహేంద్రపర్వతము[1] వరకును తీర్ధములను దేశములను ఆయతనములను జూచుచు వచ్చి దాని దాటిన తరువాత మణిపూరము వరకును సముద్రతీరమున బడిపోయి మరల మణిపూరము [2]మొదలు పట్టణములను, మేడలను, మిద్దెలను తీర్ధములను జూచినట్లు చెప్పబడినది గాని యాంధ్రదేశము చెప్పబడ లేదనియు ఇందును దేశముల దెల్పుచోట నాంధ్రాదిదేశముల ప్రశంసకలదు కాని యదియును ప్రక్షిప్తమని పైవిషయము వలనే బోధపడగలదనియు, కావున మహేంద్రపర్వతమునకును

బాండ్యదేశమునకును నడుమ దేశములేదని కొందరు తలంచుచున్నారు[3] గాని

  1. ఇది గంజాముజిల్లాలో నుత్తరభాగమున నున్నది
  2. ఇది పాండ్యదేశమునకు ముఖ్యపట్టణము.
  3. నన్నయబట్టారక చరిత్రము. పొరటలు 36-42