పుట:Andhrula Charitramu Part-1.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భోజమహారాజు సరిహద్దులనుండు రాజులతోడను గజినీమమూదు సైన్యములతోడను బోరాడవలసివచ్చి యతనిమనస్స్వాస్త్యమునకు గొంతభంగము కలుగుచువచ్చునుగాని మనయీరాజరాజనరేంద్రునకట్లు చేయదగిన యుద్ధములేవియును లేక మనంబు నిశ్శంకముగ నుండెను. అయిన నిరువురకును విద్యావ్యాసంగముల నభిరుచి మెండుగ నుండెను. భోజరాజు సంస్కృతపండితులచే సంస్కృతభాషలోనే బహుగ్రంథములను రచింపించియు సంస్కృతకళాశాలను స్థాపించినవాడగుటచేత భరతఖండమునందంతట బ్రఖ్యాతిగాంచుటకు గారణమయ్యెను. రాజనరేంద్రుడు తనదేశభాషనుద్ధరించి తరింపజేయుకొఱకే విశేషకృషిసల్పినవాడగుటచేత నొక్క యాంధ్రదేశముననే ప్రసిద్ధికెక్కియాంధ్రమహాజనులకృతజ్ఞతకు మాత్రమె పాత్రుడయ్యెను. భోజమహారాజు వీరమరణమైనను శత్రుజనమధ్యమున బ్రాణములు విడువవలసినవాడయ్యెను. రాజనరేంద్రుని కట్టిది సంభవింపలేదు. రాజనరేంద్రుని కాలము సుఖతరంబుగ నడిచెను. రాజనరేంద్రుడు భోజరాజుకంటె నదృష్టవంతుడని చెప్పవలయును.

రాజనరేంద్రుడ కావ్యగీతి ప్రియుడు.

రాజరాజు సరసుడును గాన్యగీతి ప్రియుడునని నన్నయభట్టు మహాభారతమునందు జెప్పియున్నాడు. అందుచేతనే యాతని కొల్వుకూటమెప్పుడును బహుభాషాపండితులచే నలంకరింపబడుచుండెను. వీనికెప్పుడును భారతమును వినుటయం దభిరుచి మెండుగాగలదు. బహుభాషలలో బహువిధముల బహుజనులచే జెప్పంబడుచుండిన మహాభారతకథను వినుచుండియు దృప్తిని బొందజాలక తెనుంగు భాసలోగూడ వినవలయునని యీతనికెంతో యభిలాషముగలదు.

నన్నయభట్టు.

ఒకనాడు రాజరాజవిష్ణువర్ధనుడువిద్వజ్జనంబులచే బరివేష్టింపబడినిండుకొలువున్న కాలమున మంత్రి పురోహితసేనాపతి యువరాజ దైవారిక ప్రధానసమక్షంబున దనకులబ్రాహ్మణుండును, అమర్తండును, అవిరళజపహోమతత్పరుండును, విపులశబ్దశాసనుండును, సంహితాభ్యాసుండును, బ్రహ్మాండాది