పుట:Andhrula Charitramu Part-1.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణకత్తివాడి దేశమునకు సురాష్ట్రమను పేరుగలదు. కుకురదేశము రాజపుత్రస్థానములో నొకభాగమై ఉన్నది. ఉత్తరకొంకణదేశమే అపరాంతమనబడుచున్నది. అనూపదేశము వింధ్యకు సమీపమున నున్నదని పురాణములు చాటుచున్నవి. అయ్యది నర్మదకు నెగువుననున్నదనియు రఘువంశమునందు చెప్పబడినది. అకరావంతియనునది మాళవదేశముయొక్క తూర్పుభాగముననున్నది. కాబట్టి యాంధ్రసామ్రాజ్యము దక్షిణమున మైసూరు మొదలుకొని యుత్తరమున గంగానది వరకును విస్తరించి ఉండవచ్చని చెప్పవచ్చును. మాళవము, కన్యాకుబ్జదేశము, సింధుసౌవీరదేశములు, పాంచాలకాశ్మీరదేశములు, ఉత్తరకోసల కాశీదేశములును, నేపాలభూపాలదేశములును, కామరూపబ్రహ్మదేశములును, పాండ్యచోళకేరళదేశములును మాత్ర మీయాంధ్ర సామ్రాజ్యమున జేరియుండలేదు. పైజెప్పినదేశములలో బశ్చిమోత్తరదేశములు విజాతీయుయిన శకరాజుల పాలనమునం దుండినవి.

బౌద్ధమతము

అకాలమునందలి మతములలో బుద్ధుని మతమే బహుజనానురాగమును బడసి దేశమంతటను వ్యాపించి సర్వోత్కృష్టమైనదిగా నెంచబడుచు నగ్రస్థానమును వహించియుండెను. శాలివాహనరాజులమని చెప్పుకొనియెడి యాంధ్రరాజులును, మహాభోజులమని,మహారాఠులమని చెప్పుకొనియెడి మండలాధిపతులును, బౌద్ధమతము నవలంబించి యాంధ్ర చక్రవర్తులకు నూడిగము సేయుచుండిన యవనశకపహ్లవాది నాయకులును, నైగములును(వర్తకులు), స్వర్ణకారులును, వర్ధకులు(వడ్రంగులు), ధాన్యకశ్రేణులును (ధాన్యపు వ్యాపారము చేయువారు), గాంధీకులు (ఓషధులు మొదలుగువానిని విక్రయించువారు), సామాన్య గృహస్థులును బౌద్ధమతావలంబీకుల యుపయోగార్ధ మేకశిలామయమైన కొండలను దొలిపించి గుహలను మఠములను, చైత్యములను నిర్మించుచు వచ్చిరి. ఈ యాంధ్రరాజుల పరిపాలనా కాలమున మొదట విజాతీయులును విదేశస్థులునగు యువనుల (Bactrian Greeks) శకనులు (indo Scythians) పహ్లవులు (Persians) గుంపులు గుంపులుగా వచ్చి