పుట:Andhrula Charitramu Part-1.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాలివాహన విరచితమైన యీ సప్తశతిని పొగడియున్నాడు. కావ్యప్రకాశికలోను, సరస్వతీ కంఠాభరణములోను, ధనికకృత దశరూపక వ్యాఖ్యానములోను సప్తశతినుండి పద్యములుదాహరింప బడినవి. హేమచంద్రుడు తన దేశకోశమునందు శాలివాహనుడు, హాలుడు, సాలనుడు, కుంతలుడు నాలుగునొక్కని పేరులేయని చెప్పియున్నాడు. శాలివాహన శబ్దము శాతవాహన శబ్దముయొక్క ప్రాకృత రూపమని తన వ్యాకరణమునందు జెప్పియున్నాడు. శాలివాహనుడనగా నితడేయని యిటీవలి వారెందఱో దుర్భ్రమగొనియున్నారు. పైశాచీ భాషలో బృహత్కథను కాతంత్రవ్యాకరణమును రచించిన గుణాఢ్యుడీమంత్రియని చెప్పుచున్నారు గాని యది యెంతమాత్రమును విశ్వసింపదగినదికాదు. సప్తశతిమాత్ర మీ హాలుడు రచించినట్లుగ నా గ్రంథములోనే యున్నది. ఈతని కాలమునందు రాజ్యమంతయు నెమ్మదిగనుండుటచేత నీతడు తన కాలమునంతను విద్యావ్యాసంగమునందే గడిపి సుప్రసిద్ధిని వహించినవాడు గానున్నాడు.

ఆంధ్రరాజ్యకల్లోలము.

హాలుని తరువాత "మాండలకుడు, పురీకసేనుడు, సుందరశాతకర్ణుడు, చకోర శాతకర్ణుడు" అనువారు క్రమముగా నొకరి తరువాత నొకరు రాజ్యమును పరిపాలించిరిగాని యవనపహ్లవశకును లనుమ్లేచ్ఛుల గుంపులువచ్చి దేశముపైబడి యల్లకల్లోలముగావించిన హేతువుచేత వీరి పాలనము శోభించినదికాదు. అశోకుని తరువాత యవనులు (Indo Bactrians) హిందూదేశముపై దండెత్తివచ్చి సింధుకాశ్మీర పాంచాలములజయించి పరిపాలింపసాగిరి కాని కొంతకాలమునకు పహ్లవరాజులు (పార్థియన్ రాజులు) దండెత్తి వచ్చి యవన రాజులను బాఱదోలి యమునాతీరమునందలి మధురా నగరమును తక్షశిలా నగరము రాజధానులుగ జేసికొని పరిపాలించిరి. తరువాత శకనులువచ్చి వారలను జయించి దేశమాక్రమించుకొనిరి. ఈ శకరాజులలో కనిష్కుడు మహాక్షాత్రవంతుడు. ఇతడు బహుదేశములను జయించెను. ఇతడు పురుషపురమును