పుట:Andhrula Charitramu Part-1.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రణభూతియను పిశాచరాజునకు బృహత్కథను వినుపించి శాపవిముక్తుడయ్యెను. ఈ బృహత్కథ లక్షలక్షపరిమితిగల యేడు మహాకథలను గలిగియున్నదట! పుష్పదంతుని మిత్రుడగు మాల్యవంతుడు శాపవశముచేత గుణాఢ్యుడుగా జనించి శాతవాహన మహారాజునకు మంత్రియయ్యెను. వరరుచి కాణభూతికి బృహత్కథను జెప్పిన సంగతివిని గుణాఢ్యుడు వింధ్యారణ్యమునకు బోయి తనకాకథ చెప్పి శాపవిముక్తుని చేయవలయునని కాణభూతినడిగెను. గుణాఢ్యునివంటి పండితుడు తనకు దర్శనిమిచ్చినందుకు సంతసించి కాణభూతి వాని జన్మవృత్తాంతమును దెలుపవలసినదని యడిగెను. గుణాఢ్యపండితుడిటు చెప్పెను.

గుణాఢ్య పండితుని చరిత్రము.

ప్రతిష్ఠానమునందు సుప్రతిష్ఠమను పట్టణమున సోమశర్మయను బ్రాహ్మణోత్తముడు గలడు. వానికి వత్సుడనియు గుల్మకుడనియు నిరువురు పుత్రులును శ్రుతార్థయను నొక పుత్రికయునుగలరు. కాలక్రమమున నా బ్రాహ్మణుడుభార్యతోగూడ పరలోకగతుడయ్యెను. అతనిగొమారులు చెల్లెలిని సంరక్షించుకొనుచు కాలము గడుపుచుండిరి. ఆమెకాకస్మికముగా గర్భముగలిగెను. అన్యపురుషులెవ్వరునచ్చట లేమింజేసి వత్సగుల్మకులలో నొకరిమీద నొకరికి ననుమానము గలిగియుండగా గనిపెట్టి సోదరులను సమీపించి శ్రుతార్థ "అన్నలారా, నా విషయమై మీకు పాపశంకవలదు; నాగరాజు వాసుకి తమ్మునికి కీర్తిసేనుడని కుమారుడు గలడు; అతడొకనాడు నేను స్నానముకు బోవుచుండగా చూచి మదన పరవశుడైతన కులగోత్రములు తెలిపి గాంధర్వవిధిచేత నన్ను వివాహమాడెనుకనుక నాకీ గర్భము కలిగినది" అని చెప్పెను. అందునకేమి దృష్టాంతమని సోదరులు ప్రశ్నించిరి. అంతనామె యేకాంతమున నాగకుమారుని తలచుకొనెను. అతడును వచ్చి వారలతో మీ చెల్లెలు పూర్వజన్మముననొక యప్సరస; శాపవశముననిట్టి జన్మమెత్తినది; మీరును శాపము చేత భూలోకమున జనించితిరి; ఈమెకు పుత్రుడు గలుగును; అంతటితో మీ మువ్వురకు శాపవిముక్తి కలుగును, అని చెప్పిపోయెను. పిమ్మట కొన్ని దినములకు