పుట:Andhrula Charitramu Part-1.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుండెను. ఇట్టి విగ్రహమునెదుట డోళ్ళు మ్రోగుచుండగా బూరలూదబడుచుండగా భయంకరులయిన నాగులు కాళికి దున్నపోతులను బలిపెట్టుచుండిరి. దున్నపోతులు నఱుకబడి రక్తము స్రవించుచుండగా గురువురాలు (గణాచారిణి) సివమెత్తగా లేచి వణుకుచు వికృతముగా నాట్యమాడుచు కాళి పూనినయట్లుగా "మీరు మీ దేవతకు బలియొసంగరేని ఆమె మీ విల్లులకు జయముకలుగునట్లు దీవెనలీయదు” అని హెచ్చరించును. ఈ కాళిపూజ మొదట అనార్యులయిన నాగులలో జనించి కాలక్రమమున నార్యులచేగూడ నిటీవల నాచరింపబడుచుండెను. ఇది అనార్యాచారముగాని యార్యాచారముగాదని స్పష్టముగ జెప్పవచ్చును. ఈ కాళిపూజను మాత్రమెగాక నాగులును తదితరులును ఱాళ్ళను, బుగ్గలను (చెలమల) గూడ పూజించుచుండిరి. చెవిటివారును, మూగవారును, గూనుకల వారును, కుష్ఠురోగులును మహిమగల బుగ్గలలో మునింగి యాఱాళ్ళ చుట్టును దిరిగి పూజించినయెడల స్వస్థులగుదురని విశ్వసించుచుండిరి.

ఆంధ్రరాజ్య స్థాపనము.

ఆర్యుల నార్యాంధ్రదేశమునకు వచ్చి యించుమించుగా రెండు శతాబ్దములకాలము వారి నడుమ నివసించియుండుటచేత స్వభావసిద్ధముగా నేర్పడిన సమ్మేళన సాంకర్యము వలన మిశ్రజాతియొకటిజనించి నానాటనభివృద్ధి కాజొచ్చెను. మేమిదివఱకీ చరిత్రమున నుదాహరించిన యార్యాంధ్రసంఘమె యీ మిశ్రజాతిగనున్నది. ఈ యార్యాంధ్రు లనార్యాంధ్రులకంటె నెక్కుడు నాగరికతయు, విజ్ఞానమును, పరాక్రమమును గలిగినవారయి యుండుటచేత దేశమున వీరి యధికారములు నాగాంధ్రులనుండి గైకొనబడినవి. కావున క్రీస్తు శకమునకు బూర్వము నాలుగవ శతాబ్దమునందే యాంధ్రరాజ్యము స్థాపింపబడినదని స్పష్టముగా జెప్పవచ్చును. లేనియెడల నాలుగవ శతాబ్ద ప్రారంభమున మగధ రాజ్యాధిపత్యమును వహించిన చంద్రగుప్త చక్రవర్తి యాస్థానమునందుండిన యవన దేశపు రాయబారియగు మేగాస్తనీసనువాడీ యాంధ్ర రాజ్యమును ప్రశంసింపవలసిన పనియె లేకయుండును. అతడీ యాంధ్రజాతి మిక్కిలి పరాక్రమముగల జాతియనియు, చంద్రగుప్తుని మగధ రాజ్యము తప్ప యాంధ్రరాజ్యమను మించిన రాజ్యము