పుట:Andhraveerulupar025958mbp.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోటముట్టడింప వలయునని ప్రధాన సేనానాయకున కాజ్ఞాపించెను. ఆకస్మికముగ మ్రోగుచున్న జయభేరి నాలకించి బల్లహు డాశ్చర్యమునొంది యెవడు తస్న కోపాగ్ని కాహుతి గానెంచెనో తెలిసికొందునుగాక యని బల్లహుడు బలములనన్నింటిని దత్ క్షణముననే యాయత్త పఱచి ప్రతిపక్ష బలముతో బోరుచేయ నారంభించెను. ఇరువాగులు పోరునకు దలపడెను. మాధవవర్మ సైనికులనందఱ కుచితమగు స్థానములనొసంగి యుద్ధనిపుణులగు వారికి సేనానాయకత్వమునిచ్చి కోట నలువైపుల నొక్కమాఱె ముట్టడించెను. బల్లహుడు ప్రతిశిబిరమున కేగుచు భటుల బరామర్శించుచు నుచితవిధానముల నెఱింగించుచు దనబలమును మిగుల బ్రోత్సహించు చుండెను. కాని బల్లహునకు విజయముపై నాస యెన్నడో యంతరించెను. సంగ్రామప్రయత్నములో నాత డుండకపోవుటచే స్థలాంతరములలో నున్న బలమునంతయు రప్పింప వీలు కాదయ్యెను. ఆహారపదార్థములు సైతము చాలినంతగ లేకుండెను. ప్రతిపక్షుల సైన్యము లెక్కయిడరానంత విశేషముగ నుండెను. ఆసైన్యమునకు రాజెవ్వడో, యాత డేరాజ్యమునకు బరిపాలకుడొ, నాటి విజృంభణమున కేహేతువొ బల్లహు డెఱుంగడు. తీవ్రముగ బల్లహుని సైన్యము మాధవవర్మ సైన్యముతో గొన్నిమాసములు పోరాడెను. జవసత్వములు క్షీణించుటవలనను ఆహారపదార్థములు కొఱతపడుటవలనను చేయునది